– ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్
-సెప్టెంబర్ 17న ఫైనల్ పోరు
దుబాయ్ : ఆసియా కప్ 2023పై పీటముడి వీడింది. పాకిస్థాన్ గడ్డపై ఆడేందుకు భారత్ నిరాకరించటంతో.. హైబ్రిడ్ మోడల్ ఆతిథ్య ప్రతిపాదనతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రాజీకొచ్చిన సంగతి తెలిసిందే. పీసీబీ రూపొందించిన హైబ్రిడ్ మోడల్‌ను ఆసియా క్రికెట్ కమిటీ (ఏసీసీ) తాజాగా ఆమోదించింది. ఆగస్టు 31న తొలి మ్యాచ్‌తో ఆరంభ కానున్న ఆసియా కప్.. సెప్టెంబర్ 17న టైటిల్ పోరుతో ముగియనుంది. హైబ్రిడ్ మోడల్ విధానంలో భాగంగా ఫైనల్ సహా 13 మ్యాచుల ఆసియా కప్‌లో.. నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో జరుగనుండగా.. తొమ్మిది మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఏసీసీ అధికారిక ప్రకటనలో తెలిపింది. 2008 తర్వాత తొలిసారి మల్టీ నేషన్ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో జరుగనుంది. హైబ్రిడ్ మోడల్ విధానం ఆవిష్కరించిన ఏసీసీ.. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. 2023 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఓ గ్రూప్‌లో ఉండగా.. డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లో మరో గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2 జట్లు సూపర్ 4 దశకు చేరుకుంటాయి. సూపర్ 4 దశలో ప్రతి జట్టు మరొ జట్టుతో ఓ మ్యాచ్‌లో తలపడనుంది. సూపర్ 4లో టాప్-2 జట్లు ఫైనల్లో తలపడతాయి.