ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు క్యాబినెట్ మాజీ మంత్రులు, సహాయకులపై మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయని ఆదివారం మీడియా తెలిపింది. రిజర్వేషన్‌పై చెలరేగిన ఆందోళనలు నిరసనలకు దారితీయడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
2010లో అప్పటి బంగ్లాదేశ్ రైఫిల్స్ (బిడిఆర్) అధికారి అబ్దుల్ రహీమ్ మృతిపై హసీనా, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ మాజీ డైరెక్టర్ జనరల్ జనరల్ అజీజ్ అహ్మద్‌తో పాటు మరో 11 మందిపై ఆదివారం హత్య కేసు నమోదైంది. 2010లో పిల్ఖానాలో జరిగిన మారణహోమంపై నమోదైన కేసులో మాజీ బిడిఆర్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రహీమ్ నిందితుడిగా ఉన్నాడు. అదే ఏడాది జులై 29న జైలు కస్టడీలో మరణించాడు. రహీమ్ కుమారుడు అడ్వకేట్ అబ్దుల్ అజీబ్ ఢాకా మేజిస్ట్రేట్ ముందు కేసు దాఖలు చేశారు.
జులై 18న వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమంలో మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంఐఎస్‌టి విద్యార్థిని హత్య చేసినందుకు హసీనాతోపాటు మరో 48 మందిపై ఆదివారం మరో హత్య కేసు నమోదైంది. బాధితుడు షేక్ అషాబుల్ యెమిన్ మామ అబ్దుల్లా అల్ కబీర్ ఢాకా సీనియర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎండీ సైఫుల్ ఇస్లాం కోర్టులో 49 మంది నిందితులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటీషన్ స్వీకరించిన కోర్టు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసులో అవామీ లీగ్ ప్రధాని కార్యదర్శి, రోడ్డు రవాణా, వంతెలన శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ క్వాడర్, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తదితరులను నిందితుగా చేర్చారు.ప్రస్తుతం షేక్ హసీనాపై 53 కేసులు నమోదయ్యాయి. ఇందులో 44 హత్యలు, ఏడు మానవత్వం, మారణహోమం కేసులు ఉన్నాయి. మరొకటి కిడ్నాప్, ప్రతిపక్ష బిఎస్‌పి ఊరేగింపుపై దాడి కేసులు ఉన్నాయి.