వైద్యారోగ్యశాఖలో 4 వేల పోస్టులు

– 15 రోజుల వ్యవధిలో నోటిఫికేషన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలో అన్ని రకాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇస్తున్నది. దీంతో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే 4 వేల పోస్టులకు వైద్యారోగ్య సేవల నియామక మండలి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రానున్న 10 రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు సమాచరం. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో దాదాపు 1,600 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌) పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదాన్ని వైద్యారోగ్యశాఖ కోరింది. అక్కడి నుంచి గ్రీన్‌సిగల్‌ రాగానే వాటికి కూడా నోటిఫికేషన్‌ ఇస్తామని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఆస్పత్రిలో ఉన్న ఖాళీల్లో 80 శాతం ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు గానూ 6,956 మందికి, 285 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను, 48 మంది ఫిజియోథెర పిస్టులను, 18 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 2,050 నర్సింగ్‌ ఆఫీసర్లు, 633 ఫార్మాసిస్టులు, 1,666 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(ఫీమేల్‌), 156 ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌, 435 సివిల్‌ సర్జన్‌, 24 ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులున్నాయి.