ఏడాదిలో 400 కొత్త సీఎన్‌జీ స్టేషన్లు

మేడ్చల్‌ జిల్లాలో 100వ స్టేషన్‌ ప్రారంభం
మేఘా గ్యాస్‌ వెల్లడి
హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ మేఘా గ్యాస్‌ 400 సీఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అదే విధంగా 2 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు అందించాలని నిర్దేశించుకున్నట్టు వెల్లడించింది. బుధవారం మేడ్చల్‌ జిల్లా కీసర వద్ద 100వ సీఎన్‌జీ స్టేషన్‌ను మేఘా గ్యాస్‌ సీఈఓ పలిమిపాటి వెంకటేశ్‌ ప్రారంభించారు. తొలి సీఎన్‌జీ స్టేషన్‌ను ఏపీలోని కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో ప్రారంభించి ప్రస్థానం మొదలు పెట్టామని వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్రప్రదేశ్‌లో 28, కర్ణాటకలో 12, ఉత్తర ప్రదేశ్‌లో 4, మధ్య ప్రదేశ్‌లో 4, తమిళనాడులో 3, పంజాబ్‌లో 3 చొప్పున సిఎన్‌జి స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు.