న్యూఢిల్లీ: కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామనే పేరుతో విదేశీయుల్ని మోసగించిన గురుగ్రామ్ కాల్ సెంటర్ కేసును సీబీఐ చేధించింది. సైబర్ నేరస్థులుగా అనుమానిస్తున్న 43 మందిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ కేసు విచారణలో భాగంగా గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్ సైబర్ సిటీలో ఉన్న ఇన్నోసెంట్ టెక్నాలజీ (ఒపిసి) ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించింది. విదేశీయుల్ని మోసం చేయడానికి లైవ్ కాల్స్ చేస్తున్న అనేక మంది ఏజెంట్లను సిబిఐ గుర్తించింది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడాతో సహా ఏడు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు సీబీఐ తెలిపింది. అంతర్జాతీయ సైబర్ నేరాల కోసం ఉద్దేశించిన కేంద్రాలను గురుగ్రామ్‌లోని కాల్ సెంటర్ సమన్వయం చేస్తుందని తమ సోదాల్లో వెల్లడైందని సిబిఐ అధికారులు తెలిపారు. సైబర్ నేరంలో బాధితుల్ని తమ కంప్యూటర్లలో హానికరమైన సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రేరేపించేవారని సిబిఐ పేర్కొంది. ఈ తరువాత బాధితుల కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు పరిష్కారం, నెట్‌వర్క్ పునరుద్దరణ కోసం వారి వద్ద నుంచి భారీ మొత్తంలో కాల్‌సెంటర్ వసూలు చేసేదని సిబిఐ తెలిపింది.