టెట్‌కు 43,991 దరఖాస్తులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు 43,991 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌, టెట్‌ కన్వీనర్‌ ఎం రాధారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌కు 44,935 మంది ఫీజు చెల్లించారని వివరించారు. వారిలో పేపర్‌-1కు 16,060 మంది, పేపర్‌-2కు 24,556 మంది, రెండింటికీ 4,319 మంది ఫీజు కట్టారని తెలిపారు. దరఖాస్తులను సమర్పించిన వారిలో పేపర్‌-1కు 15,768 మంది, పేపర్‌-2కు 24,050 మంది, రెండింటికీ 4,173 మంది కలిపి 43,991 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల పదో తేదీ వరకు ఉందని తెలిపారు. వచ్చేనెల 20 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు టెట్‌ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://రషష్ట్రశీశీశ్రీవసబ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.