4,500కి చేరిన తుర్కియే-సిరియా భూకంప మృతుల సంఖ్య

నవతెలంగాణ – టర్కీ
ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 4,500కు పైగా చేరిందని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. ఒక్క తుర్కియేలోనే 3వేలకు పైగా చనిపోగా.. సిరియాలో సుమారు 1500 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 వేల మందికి గాయాలయ్యాయి. తుర్కియేలో సుమారు 15వేలు, సిరియాలో దాదాపు 4వేలకు పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ భూకంపంలో మృతుల సంఖ్య మరింత భారీగా పెరగొచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 20వేల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది. తుర్కియేలోని గాజియాన్‌తెప్‌ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత దాదాపు 50 శక్తిమంతమైన ప్రకంపనలు రెండు దేశాలనూ వణికించాయి. ఆ ప్రకంపనల్లో ఒకదాని తీవ్రత భూకంప లేఖినిపై ఏకంగా 7.5గా నమోదైంది.