48 గంటల ముందు నుండే  సభలు..సమావేశాలు నిషేధం: కలెక్టర్

– 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం  4 పోలింగ్
– నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా శిక్షార్హులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ ముగిసే సమయానికి ( ఈనెల 27  సాయంత్రం 4 గంటలు) 48 గంటల ముందు నుండి ఎలాంటి బహిరంగ సభలు,సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడం  నిషేదమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రులు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టబద్రుల ఉప ఎన్నికలకు ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం  4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శాసనమండలి ఉపఎన్నిక సందర్భంగా పోలింగ్ ముగిసే సమయమైన 27వ తేదీ సాయంత్రం 4 గంటల ఆధారంగా చేసుకుని 48 గంటల ముందు నుండి ఎలాంటి ప్రచారం చేయవద్దని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అందువల్ల ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీలు ఈనెల 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి వారి ప్రచారాన్ని ముగించాలని ఆమె కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు   ఎం ఎల్ సి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని, ఎన్నికలకు సంబంధించిన  విషయాలను టీవీలు  ఇతర మాధ్యమాలలో ప్రదర్శించకూడదని, అలాగే ప్రజలకు ఎన్నికలకు సంబంధించిన విషయాలు తెలియజేయడం, ఓటర్లను ఆకర్షించడం వంటివి చేయరాదని తెలిపారు.
 ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం చేసినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టరీత్యా శిక్షార్హులవుతారని  వెల్లడించారు. అందువల్ల శాసనమండలి ఉప ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులు రాజకీయ పార్టీలు 1951 ప్రజాప్రతినిధ్య చట్టంలోని 126వ సెక్షన్ ను తు.చ తప్పకుండా పాటించి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి ఎలాంటి ప్రచారాలు నిర్వహించవద్దని, ఈ విషయాన్ని వారి కార్యకర్తలకు, రాజకీయ నాయకులకు ర్యాలీలను తీసే వారికి అందరికీ సమాచారం ఇవ్వాలని కోరారు. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుండి  ఇతర ప్రాంతాల వారు నియోజకవర్గంలో ఉండకుండా, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ వంటివి తనిఖీ చేసి బయట నుండి వచ్చిన వారిని పంపించివేయాలని, అలాగే లాడ్జిలు, గెస్ట్ హౌస్ లు అన్నింటిని పరిశీలించాలని ఎమ్మెల్సీ నియోజకవర్గం, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని  కోరారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు  రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరారు.