జాతీయ లోక్‌ అదాలత్‌లో 480 కేసులు పరిష్కారం

– లోక్‌ అదాలత్‌ తీర్పు అంతిమ తీర్పు
– న్యాయ చైతన్య సదస్సులో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి
నవతెలంగాణ-ఇల్లందు
రాజీ పడదగిన కేసులలో ఇరు వర్గాల కక్షిదారులు కోర్టుకు వచ్చి రాజీ కుదిర్చుకున్నట్లయితే సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం కోర్టు ఆవరణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. వారి విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చునని అదేవిధంగా ఎవ్వరూ నష్టపోకుండా ఇరు వర్గాలు గెలిచినట్లేనని, ఒకసారి లోక్‌ అదాలత్‌లో రాజీ పడినట్లయితే పైకోర్టుకు అప్పిలు వెళ్లే అవకాశం ఉండదని తెలిపారు. అదేవిధంగా కక్షిదారులు గ్రామస్థాయిలో పంచాయతీ నిర్వహించి రాయించుకున్న అగ్రిమెంట్లు కోర్టులో చెల్లుబాటు కావని వాటికి చట్టబద్ధత ఉండదు అని కోర్టుకు వచ్చి రాజీ పడ్డ కేసుల్లో చట్టబద్ధత ఉంటుందని, కాబట్టి కక్షిదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భూక్య రవికుమార్‌ నాయక్‌, ప్రధాన కార్యదర్శి కే.ఉమేశ్వరరావు సంయుక్త కార్యదర్శి కీర్తి కార్తిక్‌, లోక్‌ అదాలత్‌ మేంబర్‌ సిహెచ్‌ నవీన్‌ కుమార్‌, సీనియర్‌ న్యాయవాదులు ఎన్‌.చెన్నకేశవరావు తుమ్మలపల్లి ప్రభాకర్‌, దంతాల ఆనంద్‌, పి.బాలకృష్ణ, పప్పుల గోపీనాథ్‌, ఎండి కాసిం, పైల జయప్రకాష్‌, జూనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో 480 కేసులు పరిష్కారం కాగా ఇందులో పోలీస్‌ కేసులు-45, గృహింస కేసులు-2, సివిల్‌ కేసులు-1, పిటీ కేసులు-405, ఫ్రీ లిటిగేషన్‌ కేసులు-27, మొత్తం 480 కేసులు పరిష్కరించబడ్డాయి.