– మిగిలిన 2.37 లక్షల మంది నిరుద్యోగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ సర్వీసు టీచర్లు 48,582 మంది దరఖాస్తు చేశారు. ఉపాధ్యాయ పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పదోన్నతికి అర్హులైన ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్-1కు 9,756 మంది, పేపర్-2 మ్యాథమెటిక్స్‌కు 22,369 మంది, సోషల్ స్టడీస్‌కు 16,457 మంది కలిపి 48,582 మంది ఉపాధ్యాయులున్నారు. రాష్ట్రంలో 1.04 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో నాలుగు వేల మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు (జీహెచ్ఎం) ఉన్నారు. వారికి టెట్ అవసరం లేదు. మిగిలిన లక్ష మందిలో సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 70 వేల మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కావాల్సి ఉన్నది. వారిలో 48,582 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది ఉన్నారు. దరఖాస్తు చేసిన వారిలో ఇన్ సర్వీసు టీచర్లు 48,582 మంది ఉంటే, మిగిలిన వారు 2,37,804 మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులున్నారు. వచ్చేనెల 20 నుంచి జూన్ మూడో తేదీ వరకు టెట్ రాతపరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://రషష్ట్రశీశీశ్రీవసబ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.