– హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
నవతెలంగాణ-హైదరాబాద్
ఇటీవల సంభవించిన వరదల్లో 49 మంది మృతి చెందారని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. 23 మంది మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు చొప్పున సాయం అందజేశామనీ, మిగిలిన 26 కుటుంబాలకు చెందిన వారసులను గుర్తించాక సాయం అందజేస్తామని చెప్పింది. వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ మేరకు విపత్తుల నివారణ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. జాతీయ విపత్తుల సహాయక నిబంధనలకు అనుగుణంగా వరద బాధితులను ఆదుకోవడం లేదని పేర్కొంటూ చెరుకు సుధాకర్ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలను వేగంగా తీసుకోవడం ద్వారా ప్రభుత్వం భారీ ప్రాణ నష్టం లేకుండా చేసిందన్నారు. ఇప్పటి వరకూ పంట సర్వే పూర్తి అయ్యాక నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 20,387 మంది వరద బాధితుల్ని గుర్తించామనీ, బాధితులను ఆదుకుంటామన్నారు. మళ్లీ వర్షాలు పడతాయనే హెచ్చరికల కారణంగా ఈసారైనా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది ప్రభాకర్ కోరారు. మృతుల సంఖ్య 51 గా నమోదైందని వివరించారు. భారీ వర్షాల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ, గత అనుభవాలను బేరీజు వేసుకుని లోటుపాట్లు సవరించాలని హైకోర్టు సూచించారు. వరద సాయంపై సమగ్ర తాజా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణను 22కి వాయిదా వేసింది.
సీసీ కెమెరాల ఏర్పాట్ల గురించి చెప్పండి
సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లల్లో సీసీ కెమెరాలను ఏ మేరకు ఏర్పాటు చేశారనే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని హోం శాఖను హైకోర్టు ఆదేశించింది. బీహార్ నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికుడు నితీష్ కుమార్ నగరంలోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో మరణించిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారించింది. ఈ క్రమంలో పైవివరాలు అందజేయాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. పోలీస్ కస్టడీలో ఉండగా గుండెపోటు వచ్చి మరణించాడనీ, దీనికి చెందిన సీసీ కెమెరా పుటేజీ ఉందని ప్రభుత్వం విచారించింది. ఈ పుటేజీతోపాటు అన్ని పోలీస్ స్టేషన్లల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై సమగ్ర నివేదికతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.