జైస్వాల్‌కు 4వ ర్యాంక్‌

– ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్‌ 4వ ర్యాంక్‌లో నిలిచాడు. బ్యాటర్ల విభాగంలో కోహ్లి, రిషబ్‌ పంత్‌ టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. జైస్వాల్‌ 792రేటింగ్‌ పాయింట్లతో 4వ స్థానంలో నిలువగా.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హారీ బ్రూక్‌ 829రేటింగ్‌ పాయింట్లతో జైస్వాల్‌ను అధిగమించి మూడో స్థానానికి ఎగబాకాడు. కోహ్లి(724పాయింట్లు) 7వ స్థానంలో నిలువగా.. టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌(718) 9వ స్థానంలో ఉన్నాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల హవా కొనసాగింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌-3లో నిలిచారు. పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్ట్‌లో హ్యారీ బ్రూక్‌ ట్రిపుల్‌ సెంచరీ, జో రూట్‌ డబుల్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలతో రూట్‌ కెరీర్‌ అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు (932) సాధించి టాప్‌ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకున్నాడు. బ్రూక్‌ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి కేన్‌ విలియమ్సన్‌తో సహా రెండో స్థానాన్ని ఆక్రమించాడు.
రూట్‌, బ్రూక్‌ దెబ్బకు భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి చెరో స్థానం కోల్పోయి నాలుగు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన పాక్‌ ఆటగాళ్లు అఘా సల్మాన్‌, షాన్‌ మసూద్‌ 11, 12 స్థానాలు మెరుగపర్చుకుని 22, 51వ స్థానాలకు ఎగబాకారు. టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయాని కొస్తే.. ఈ విభాగం టాప్‌-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. బుమ్రా, అశ్విన్‌ టాప్‌-2లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా ఆరు, కుల్దీప్‌ 16 స్థానాల్లో ఉన్నారు. పాక్‌తో టెస్ట్‌ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన జాక్‌ లీచ్‌ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకాడు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్‌ టాప్‌-2లో కొనసాగుతుండగా.. జో రూట్‌ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు.