50 లక్షల పేద కుటుంబాల్లో ‘గృహజ్యోతి’

– ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత కరెంట్‌
– పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి
– ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో విద్యుత్‌రంగంలో అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఏడాది పాలనలో ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌, ఆర్థిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన శాఖలపై పూర్తి పట్టు సాధించారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుతూనే, ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ విద్యుత్‌రంగంలో దుబారాను కట్టడి చేసే చర్యలు చేపట్టారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రంలో 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే గృహజ్యోతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. వారందరికీ సున్నా బిల్లులు ఇస్తున్నారు. అదే సమయంలో 39,067 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ అందిస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.101.57 కోట్ల సబ్సిడీ సొమ్మును విద్యుత్‌ సంస్థలకు అందచేసింది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ సంస్థలు రూ.83వేల కోట్ల అప్పులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలను నియంత్రిస్తూ, పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. దానికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, గతంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించేందుకు తొలి ఏడాదిలో 29 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుస్తూ, రూ.10,444 కోట్ల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరించింది. గడచిన పదేండ్లలో రాష్ట్ర ప్రజలపై అప్పటి ప్రభుత్వం రూ.20 వేల కరెంటు ఛార్జీల భారాన్ని మోపింది. కానీ ప్రజాప్రభుత్వం వచ్చాక 1.85 కోట్ల మంది వినియోగదారులపై ఎలాంటి కరెంట్‌ ఛార్జీల భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్‌ వినియోగ గరిష్ట డిమాండ్‌ 15,623 మెగావాట్లకు చేరినా, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంది. మహిళా శక్తి సంఘాలకు 4వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఇవ్వనున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌లకు నూతన వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. అవసరమైన చోట్ల 244 కొత్త సబ్‌ స్టేషన్లను నెలకొల్పాలని ప్రభుత్వ నిర్ణయించింది.