– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
– భువనగిరిలో సామూహిక నిరసన దీక్ష
నవతెలంగాణ-భువనగిరి
బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో రైతుబజార్ దగ్గర బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించి 15 ఏండ్లవుతున్నా పూర్తి కాలేదన్నారు. రిజర్వాయర్ పూర్తయితే జిల్లాకు సాగునీరు, తాగు నీరు అందుతుందన్నారు.రిజర్వాయర్ పూర్తి నిర్మాణం కోసం రూ.500 కోట్లు అవసరం ఉంటే రూ.50 కోట్లు ప్రకటించి ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. వాటితో రిజర్వాయర్ ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. రిజర్వాయర్ పరిధిలో ఇండ్లు, భూములు కోల్పోయిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు వెంటనే పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్‌ను పూర్తి చేయడంతో గోదావరి జలాలను అందించొచ్చన్నారు.ఈ సామూహిక నిరసన దీక్షకు బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు,కల్లూరి మల్లేశం, దాసరి పాండు, నాయకులు మాయకృష్ణ, దయ్యాల నర్సింహ, సిరిపంగి స్వామి, బబ్బూరి పోశెట్టి, పల్లెర్ల అంజయ్య, గాడి శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు పాల్గొన్నారు.