ఒక్క పోస్టుకు 500 మంది పోటీ…

– ప్రభుత్వ ప్రకటనలో అస్పష్టత
– నిలోఫర్‌ ఆస్పత్రిలో నర్సింగ్‌ అభ్యర్థుల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఒక్క పోస్టు. అది కూడా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఉద్దేశించింది. ఆ పోస్టు జోన్‌ ఆరు పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రిలో ఉన్న ఒక్క కాంట్రాక్టు పోస్టుకు సంబంధించి గురువారం నిర్వహించిన వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి దాదాపు 500 మంది నర్సింగ్‌ అభ్యర్థులు హాజరయ్యారు. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభ్యర్థులకు అక్కడ ఒక్కటే పోస్టు ఉందనీ, అది కూడా జోన్‌ ఆరు పరిధిలోని వారికోసమేనని తెలపడంతో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. దీంతో అక్కడే బైఠాయించిన వారి నుంచి ఐదుగురితో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉషారాణి చర్చలు జరిపారు. ఒక్క పోస్టు అయినా సరే పారదర్శకంగా భర్తీ చేయాలనే ఉద్దేశం తో పూర్తి వివరాలతో తాము రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖకు పంపించినట్టు అభ్యర్థులకు నచ్చజెప్పారు. అయితే సమాచార, పౌర సంబంధాలశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో పోస్టుల సంఖ్య, జోన్‌ పరిధి పై స్పష్టత లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని వివరించారు. అయితే హాజరైన వారందరి నుంచి అర్హత సర్టిఫికేట్ల జిరాక్స్‌లను తీసుకున్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ అనంతరం ఆ ఒక్క పోస్టును అర్హత ఉన్న వారితో నింపుతామని హామీ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు.