లాసెట్‌లో 5,363 మందికి సీట్ల కేటాయింపు

– ఆరు వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మొదటి విడత సీట్లు కేటాయించారు. ఈ మేరకు లాసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ పి రమేష్‌బాబు సోమ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ మూడేండ్ల కోర్సులో 4,285 సీట్లు, ఎల్‌ఎల్‌బీ ఐదేండ్ల కోర్సులో 2,039 సీట్లు కలిపి మొత్తం 6,324 సీట్లు కన్వీనర్‌ కోటాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14,817 మంది వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని పేర్కొన్నారు. ఎల్‌ఎల్‌బీ మూడేండ్ల కోర్సు ల్లో 3,901 మంది, ఎల్‌ఎల్‌బీ ఐదేండ్ల కోర్సులో 1,462 మంది కలిపి మొత్తం 5,363 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. కేటాయించిన కాలేజీల్లో ధ్రువపత్రాల పరిశీలన భౌతికంగా జరుగుతుందని తెలిపారు. మంగళవారం నుంచి ఈనెల ఆరో తేదీ వరకు కేటాయించిన కాలేజీల్లో చేరాలని కోరారు. ఈనెల తొమ్మిది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.