– ఈ ఏడాదిలో మరణాలపై
– రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ నివేదిక
పారిస్ : ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో 54 మంది జర్నలిస్టులు తమ విధులను నిర్వహిస్తున్నప్పుడు లేదా వారి వృత్తి కారణంగా మృతి చెందారు. వారిలో మూడో వంతు ఇజ్రాయిల్ సైన్యం చేత చంపబడ్డారని గురువారం రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆరెస్‌ఎఎఫ్) ప్రచురించిన వార్షిక నివేదికలో పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ, ఎన్జీఓల సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలో 18 మంది జర్నలిస్టుల మరణాలకు ఇజ్రాయిల్ సాయుధ దళాలు కారణమ య్యాయని తెలిపింది. గాజాలో 16 మంది, లెబనాన్‌లో ఇద్దరు మృతి చెందినట్టు పేర్కొంది. పాలస్తీనా జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా, గత ఐదేండ్లలో (డిసెంబర్ 1 వరకు) ఇతర దేశాల కంటే ఎక్కువ మరణాల సంఖ్య నమోదైందని ఆర్‌ఎస్‌ఎఎఫ్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ”జర్నలిస్టులపై ఇజ్రాయిల్ సైన్యం చేసిన యుద్ధ నేరాల”పై ఆ సంస్థ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ)లో నాలుగు ఫిర్యాదులను దాఖలు చేసింది. అక్టోబరు 2023లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో మొత్తం 145 మందికిపైగా జర్నలిస్టులు మరణించారని, వారిలో 35 మంది విధుల నిర్వహణలో మరణించారని ఆర్‌ఎస్‌ఎఎఫ్ తెలిపింది.2024లో ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మరణించారని, వారిలో సగానికిపైగా గాజాలో ఉన్నారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐ.ఎఫ్.జె) మంగళ వారం ప్రచురించిన ప్రత్యేక నివేదికలో పేర్కొంది. వృతులను లెక్కించడంలో ఉపయోగించే రెండు వేర్వేరు పద్ధతుల కారణంగా ఐ.ఎఫ్.జె, ఆర్‌ఎస్‌ఎఎఫ్ మధ్య గణాంకాలు విభిన్నంగా ఉంటాయి. ఇజ్రాయిల్ ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టులకు హాని చేస్తుందనే నివేదికను ఖండిం చింది. అయితే సైనిక వైమానిక దాడుల్లో కొందరు మరణించారని అంగీకరించింది. ఆర్‌ఎస్‌ఎఎఫ్ గణాంకాల ప్రకారం, డిసెంబర్ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 550 మంది జర్నలిస్టులు అరెస్టు చేశారు. గత ఏడాది 513 మందిని అరెస్టు చేశారు.