భారతీయుడు సహా 56 మంది మృతి

– సుడాన్‌లో కొనసాగుతున్న సైన్యం, పారా మిలటరీ ఘర్షణలు
– 595 మందికి గాయాలు
ఖర్టూమ్‌ : సుడాన్‌లో సైన్యం, పారా మిలిటరీ దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో కేరళకు చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగితోపాటు 56 మంది మరణించారు. మరో 595 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కూడా తుపాకీ కాల్పులు, పేలుళ్లతో దేశమంతా దద్దరిల్లుతోంది. వరుసగా రెండోరోజూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. సూడాన్‌ ఘర్షణల్లో కేరళలోని నెల్లిపర గ్రామానికి చెందిన 48 ఏళ్ల అగస్టిన్‌ మరణించినట్లు ఖర్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం గుర్తించింది. భారత సైన్యంలో పదవీ విరమణ చేసిన ఆయన గత ఏడాది నుంచి సూడాన్‌లోని డాల్‌ గ్రూప్‌లో సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. యుకెలోని తన పెద్దకుమారుడికి ఫోన్‌ చేయడానికి కిటికీ తెరిచినప్పుడు తూటా తగిలింది. ఇటీవల ఆయన చిన్నకుమార్తె, భార్య సెలవుల కోసం సూడాన్‌ వచ్చారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
సూడాన్‌లో సైన్యం, పారా మిలటరీ మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పారా మిలటరీ దళమైన రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)ను సైన్యంలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఎలా విలీనం చేయాలి, ఎవరు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలనే అంశాలపై సూడాన్‌ మిలటరీ కమాండర్‌ జనరల్‌ అబ్దుల్‌ ఫత్తా బుర్హాన్‌, ఆర్‌ఎస్‌ఎఫ్‌ అధిపతి జనరల్‌ మొహమ్మద్‌ హమ్దాన్‌ మధ్య నెల రోజులుగా చర్చలు జరుగుతున్నా ప్రతిష్టంభన కొనసాగింది. శనివారం అర్ధరాత్రి నుంచి రాజధాని ఖార్టూమ్‌సహా దేశవ్యాప్తంగా సైన్యం, పారా మిలటరీ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాటికి 56 మంది మరణించినట్లు ఒక వైద్యుల సిండికేట్‌ తెలిపింది. జన సంచారం ఉన్న ప్రాంతాల్లోనూ ఘర్షణలు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని ఒమ్‌ దుర్మాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అమల్‌ మొహమ్మద్‌ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎఫ్‌తో చర్చలు జరపబోమని, దానిని నిర్మూలిస్తామని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సూడాన్‌లో 2021లో సైన్యం, పారా మిలటరీ సంయుక్తంగా తిరుగుబాటు చేసి ప్రభుత్వంలోకి వచ్చాయి. ఘర్షణలను ఆపాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటరస్‌, ఇయు విదేశాంగ విధాన చీఫ్‌, అరబ్‌ లీగ్‌ అధిపతి, ఆఫ్రికన్‌ యూనియన్‌ కమిషన్‌ చీఫ్‌, మిత్రదేశాలు ఖతార్‌, ఈజిప్టు, సౌదీ అరేబియా, యుఎఇ కోరాయి.