6,7 తేదీల్లో ఏఐఎన్‌యూ ఆధ్వర్యంలో యూరాలజీ సదస్సు

– శస్త్రచికిత్సల్లో అత్యాధునిక పద్ధతులపై దృష్టి
– 800 మందికిపైగా యూరాలజిస్టులు హాజరయ్యే అవకాశం
– మూత్రనాళ పునర్నిర్మాణాలపై 24 లైవ్‌ సర్జరీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు దేశంలోనే పేరెన్నికగన్న ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్‌ను యూరేత్రా ఏ ఏఐఎన్‌యూ పేరుతో హైదరాబాద్‌లో ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం సీనియర్‌ కన్సల్టెంట్‌ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డాక్టర్‌ భవతేజ్‌ ఎన్‌గంటి ఒక ప్రకటన విడుదల చేశారు. జేఆర్‌సీ కన్వెన్షన్‌, ట్రేడ్‌ ఫెయిర్స్‌ ప్రాంగణంలో జరిగే ఈ సదస్సులో యూకే, మెక్సికో, గల్ఫ్‌ దేశాలు, ఆఫ్రికా, నేపాల్‌, బంగ్లాదేశ్‌, ఆగేయాసియా దేశాలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికిపైగా యూరాలజిస్టులు పాలుపంచుకోనున్నారు. మల్లిక్‌ రాజు పూర్ణ యూరోకేర్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమానికి సహ నిర్వాహకులుగా ఉండనున్నారు. దేశంలో అతిపెద్ద యూరాలజీ సదస్సు ఇదే. సదస్సులో 24 లైవ్‌ సర్జరీలు ప్రదర్శిస్తారు. మూత్రనాళ పునర్నిర్మాణాలలో కొత్త టెక్నిక్‌లు నేర్పించనున్నారు. శస్త్రచికిత్సల్లో సంక్లిష్ట అంశాలు, మూత్రనాళం సన్నబడినప్పుడు పిల్లలు, పురుషులు, మహిళల్లో ఎలా చేయాలనేవాటిని చూపిస్తారు. జన్యుపరమైన ఇంజినీరింగ్‌ చేసిన సామాగ్రి, రీజనరేటివ్‌ మెడిసిన్‌లో సెల్‌ థెరపీ లాంటి అత్యాధునిక పద్ధతుల గురించి కూడా చర్చిస్తారు. పుణెకు చెందిన డాక్టర్‌ సంజరు కులకర్ణి, కోయంబత్తూరుకు చెందిన డాక్టర్‌ గణేశ్‌ గోపాలకృష్ణన్‌ లాంటి యూరాలజీ దిగ్గజాలతో పాటు ఐఎస్‌బీ హైదరాబాద్‌ మాజీ డీన్‌ అజిత్‌ రంగేకర్‌ ఈ సదస్సులో కీలకప్రసంగాలు చేయనున్నారు. ”మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చాలా సంక్లిష్టం. వీటిలో వైఫల్యాలు కూడా ఎక్కువే. అందువల్ల బాగా శిక్షణ పొందిన, నైపుణ్యం ఉన్న యూరాలజిస్టుల అవసరం బాగా ఎక్కువ. యూరాలజిస్టులందరికీ విజ్ఞానం పంచడం, తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించడం మా సదస్సు ప్రధాన లక్ష్యం” అని భవతేజ్‌ వివరించారు.