రాచకొండలో 6 శాతం పెరిగిన నేరాలు

6 percent increase in crimes in Rachakonda– 25 శాతం పెరిగిన సైబర్‌ నేరాలు
– భూ కబ్జాదారులు, లోన్‌యాప్‌ ముఠాలపై ప్రత్యేక నిఘా
– మహిళల భద్రతకు పెద్దపీట
– వార్షిక నేర నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్‌బాబు
నవతెలంగాణ-హయత్‌ నగర్‌/ సిటీ బ్యూరో
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ సారి 6.86 శాతం నేరాలు పెరిగాయని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. భూకబ్జాదారులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. లోన్‌యాప్‌ ముఠాల ఆగడాలను అరికడతామని, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. సైబర్‌ నేరాలు 25 శాతం పెరిగాయని, మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గాయన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వార్షిక నేర నివేదికను హైదరాబాద్‌ నాగోల్‌లో జరిగిన దేవకి కన్వెన్షన్‌ హాల్‌లో బుధవారం జరిగిన సమావేశంలో సీపీ సుధీర్‌ బాబు విడుదల చేసి వివరించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో గతేడాది 30,148 కేసులు నమోదు కాగా 2023 కేసులను ఛేదించారు. ఈ ఏడాది 36,126 కేసులు నమోదు కాగా 27,210 కేసులను ఛేదించారు. ఇక 2,562 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మంది అరెస్టు చేశారు. ఈ ఏడాది మొత్తంగా 5,241 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి.
నేరాల నివారణకు కమిషనరేట్‌ పరిధిలో కమ్యూనిటీ కెమెరాలు 14,710 ఉండగా, నేను సైతం కెమెరాలు 1,72,633 ఉన్నాయి. కమిషనరేట్‌ పరిధిలోని నేరాలకు సంబంధించి మొత్తం రూ.12.77 కోట్లు రికవరీ చేశారు. గతేడాదితో పోలిస్తే 2 శాతం రికవరీ రేట్‌ పెరిగింది. గేమింగ్‌ యాక్ట్‌పై 188 కేసులు నమోదు కాగా 972 మంది అరెస్టయ్యారు. 20 కేసుల్లో నిందితులకు జీవితఖైదు పడింది. అలాగే 2,900 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దయ్యాయి. గతేడాదితో పోలిస్తే 16 శాతం రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయి. ప్రమాదాల్లో 633 మంది మృతి చెందగా 3,205 మందికి గాయాలయ్యాయి. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 56 కేసుల్లో 153 మంది అరెస్టయ్యారు. 71 మంది బాధితులకు విముక్తి కలిగించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన 271మంది జైలుకు వెళ్లారు. డ్రగ్స్‌కు సంబంధించి 282 కేసులు నమోదు కాగా 698 మందిని అరెస్ట్‌ చేశారు. 12మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. పేకాట, బెట్టింగ్‌లలో 188 కేసులు నమోదు కాగా 972 మందిని అరెస్ట్‌ చేశారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌ నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన 8,758 ఫిర్యాదుల్లో 4,643 పరిష్కారమయ్యాయి.
పెరిగిన కిడ్నాప్‌లు, హత్యలు
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో గతేడాదితో పోల్చితే మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గినప్పటికీ కిడ్నాప్‌లు, వరకట్నం వేధింపులు, హత్యలు పెరిగాయి. గతేడాది వరకట్నం హత్యలకు సంబంధించి 5 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 6 కేసులు నమోదయ్యాయి. 2022లో నలుగురు మహిళలు హత్యకు గురికాగా, ఈ ఏడాది 12 మంది హత్యకు గురయ్యారు. గతేడాది 110 మంది మహిళలు కిడ్నాప్‌కు గురికాగా, ఈ ఏడాది 116 కిడ్నాప్‌ కేసులు నమోదయ్యాయి. మహిళలపట్ల అసభ్యకరంగా వ్యవహరించిన కేసులు 673 కేసులు నమోదకాగా, ఈ ఏడాది 744కేసులు నమోదయ్యాయి. ఇక గత ఏడాది పొక్సో కేసులు 442 నమోదు కాగా ఈ ఏడాది 317 కేసులు నమోదయ్యాయి. ఈ సమావేశంలో అదనపు సీపీలు, నాలుగు జోన్ల డీసీపీలు, ఇద్దరు ఎస్‌ఓటీ డీసీపీలు, సైబర్‌ డీసీపీ, ఇద్దరు ట్రాఫిక్‌ డీసీపీలు, షీ టీం డీసీపీలతోపాటు ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.