మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు

మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు– 31లక్షల మంది తరలివస్తారని అంచనా : మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క
నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఆరు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, 31లక్షల మంది సందర్శకులు తరలివస్తారని అంచనా వేసినట్టు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క తెలిపారు. సోమవారం టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. తాడ్వాయిలోని టికెట్‌ ఇష్యూయింగ్‌ కౌంటర్లు, కామారంలో మూడు బస్సుల పార్కింగ్‌ పాయింట్లు, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్టాండ్‌, బేస్‌ క్యాంప్‌, 48 క్యూ రెయిలింగ్స్‌ను పరిశీలించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్‌లో టీఎస్‌ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమ్పరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మేడారం జాతరలో సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. జాతరకు మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.
ఈ నెల 16న మేడారంలో టీఎస్‌ఆర్టీసీ బేస్‌ క్యాప్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. మేడారం జాతరలో దాదాపు 14వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, వారికి వసతి, భోజనం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. మేడారం జాతరను టీఎస్‌ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్‌ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్‌, అదనపు కలెక్టర్‌ శ్రీజ, టీఎస్‌ఆర్టీసీ సీవోవో డాక్టర్‌ రవిందర్‌, ఈడీలు మునిశేఖర్‌, కష్ణకాంత్‌, రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్‌, సీపీఎం ఉషాదేవి, వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, రంగారెడ్డి ఆర్‌ఎంలు పాల్గొన్నారు.