64 గళ్ల ఆటలో కొత్త రారాజు

In a game of 64 balls The new kingఆదివారం అర్ధరాత్రి భారత్‌ కీర్తి కిరీటం ధగధగా మెరిసింది. ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన ఆ కీర్తి కిరీటాన్ని ధరించాడు. 17 ఏండ్ల వయసులోనే 64 గళ్ల యుద్ధక్షేత్రంలో.. 7 మంది బలమైన ప్రత్యర్థులను ఓడించి విజేతగా నిలిచాడు. ప్రపంచ మహా సమరానికి సై అంటున్న ఆ యువరాజు… దొమ్మరాజు గుకేశ్‌. తెలుగు మూలాలున్న ఈ చెన్నై టీనేజర్‌ సంచలనం సష్టించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగ క్రీడాకారులు తలపడ్డ క్యాండిడేట్స్‌ టోర్నీలో జయకేతనం ఎగురవేశాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
”ఈ టోర్నీలో భారత అవకాశాలు స్వల్పమే. మన కుర్రాళ్లు గెలుస్తారని చెప్పలేం”.. క్యాండిడేట్స్‌ టోర్నీ ఆరంభానికి ముందు దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ చేసిన వ్యాఖ్యలివి. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ అలాంటి అభిప్రాయం వెల్లడించడం, టోర్నీలో 2018లో గెలిచిన కరువా నా, వరుసగా గత రెండు సార్లు నెగ్గిన నెపోమ్నియాషి ఉండటంతో మన కుర్రాళ్లకు కష్టమే అనిపించింది.
64 గళ్ల ఆటలో కొత్త రారాజు వచ్చాడు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా భారత చదరంగ క్రీడకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వారసుడిగా తెలుగు మూలాలున్న 17 ఏండ్ల చెన్నై చిన్నోడు దొమ్మరాజు గుకేశ్‌ సంచలన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళు పాల్గొనే ‘క్యాండిడేట్స్‌’లో ఉన్నదే 16 మంది. అందులో ముగ్గురు మగ వాళ్ళు (గుకేశ్‌, విదిత్‌, ఆర్‌. ప్రజ్ఞానంద), ఇద్దరు ఆడవారు (కోనేరు హంపీ, ఆర్‌. వైశాలి)తో మొత్తం అయిదుగురి అతి పెద్ద బృందం భారత్‌దే. ఇంతమంది ఆటగాళ్ళు ఈ క్లిష్టమైన అలాగే, 2024 ఏప్రిల్‌ నాటి ‘ఫిడే’ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 25లో అయిదుగురు భారతీయ పురుషులే.
మహిళల ర్యాకింగ్స్‌లో టాప్‌ 15లో ముగ్గురు మనవాళ్ళే. జూనియర్‌ ర్యాకింగ్స్‌కు వస్తే టాప్‌ 20లో ఏడుగురు భార తీయులే. అదే టాప్‌ 30 జూనియర్స్‌ని గనక లెక్క తీస్తే మూడింట ఒక వంతు మన దేశీయులే.ప్రపంచ చదరంగ వేదికపై అంతకంతకూ విస్తరిస్తున్న భారతదేశ స్థాయికీ, స్థానానికీ ఇదే సాక్ష్యం.
ఈ కంప్యూటర్‌ యుగంలోనూ సంప్రదాయ శిక్షణ, క్లాసికల్‌ ఫార్మాట్‌పై ప్రేమ అతణ్ని భిన్నంగా నిలుపుతోంది. పిన్న వయస్సు (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు)లోనే గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన గుకేశ్‌.. కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ రికార్డు కోల్పోయాడు. ప్రపంచంలో మూడో అతి పిన్న వయస్సు గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. అలాంటి ఆటగాడు ఆరంభం నుంచి కోచ్‌ల శిక్షణలో, బోర్డుపై గేమ్‌లు ఆడుతూ ఎదిగాడు. ఎలో రేటింగ్‌ 2500 దాటిన తర్వాతే గుకేశ్‌ చెస్‌ ఇంజన్ల సాయం తీసుకున్నాడు. 36 ఏళ్లలో తొలిసారి విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కినెట్టి నిరుడు గుకేశ్‌ భారత టాప్‌ ర్యాంకు ఆటగాడిగా నిలిచాడు.
గెలుపుతో స్ఫూర్తి పొందేవాళ్లను చూసుంటాం. కానీ ఓటమి నుంచి ప్రేరణ పొంది, కసిగా ఆడాలనేది గుకేశ్‌ మంత్రం. స్వీయ నమ్మకంతో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనే చెక్కుచెదరకుండా ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నాడు. 2022లో దిగ్గజం కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. 2022 ఒలింపియాడ్‌లో మొదటి బోర్డుపై వ్యక్తిగత స్వర్ణం గెలిచాడు. నిరుడు ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు. గతేడాది అత్యధికంగా 2,758 రేటింగ్‌ సాధించిన గుకేశ్‌.. ప్రస్తుతం 2,743 వద్ద ఉన్నాడు. ప్రపంచ చెస్‌లో 2750 రేటింగ్‌ దాటిన పిన్న వయస్సు క్రీడాకారుడూ అతనే.
చిన్నప్పటి నుంచి అమ్మానాన్న నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 2018 ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అయిదు స్వర్ణాలు గెలవడంతో వాళ్లకు నాపై పూర్తి నమ్మకం వచ్చింది. ఈఎన్‌టీ సర్జన్‌ అయిన నాన్న నా కోసం ప్రాక్టీస్‌ ఆపేశారు. అప్పుడు అమ్మ సంపాదనతోనే ఇల్లు గడిచేది. రెండేళ్ల పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ నాన్న ఏ కష్టాన్ని నా వరకూ రానివ్వలేదు. నేను గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాక పరిస్థితి మెరుగైంది. కరోనా సమయంలో బయట టోర్నీలు లేకపోవడంతో నాన్న వైద్యుడిగా పనిచేశారు.
ఆనంద్‌ సర్‌ను ఆరాధిస్తూ పెరిగా. ఆయన అకాడమీలో శిక్షణ పొందడం గొప్ప అవకాశం. ఆయన సూచనలతో నా ఆట ఇంకా మెరుగైంది. ఇప్పుడు ఆయన బాటలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడం ఆనందంగా ఉంది.
మేం చెన్నైలో స్థిరపడ్డా మా కుటుంబంలో తెలుగు మూలాలున్నాయి. మా ముత్తాతలు పుత్తూరు సమీపంలోని సత్యవేడు దగ్గర గ్రామంలో ఉండేవాళ్లు. ఇప్పటికీ అక్కడ మాకు బంధువులున్నారు. చిన్నప్పుడు అమ్మానాన్నతో కలిసి అక్కడికి వెళ్లేవాణ్ని. కానీ చెస్‌ కెరీర్‌ కారణంగా ఇప్పుడు కుదరడం లేదు.

ప్రపంచ చాంపియన్‌తో ‘డీ’
ఈ విజయంతో గుకేశ్‌.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతడు చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌తో తలపడాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కానప్పటికీ ఇక్కడా గెలిస్తే ప్రపంచ చాంపియన్‌గా నిలిచే అతి పిన్న వయస్కుడిగా అతడు రికార్డులకెక్కుతాడు.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417