– భువనగిరిలో అత్యధికంగా 76.78 శాతం
– హైదరాబాద్‌లో అత్యల్పంగా 48.48 శాతం
– రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లోక్‌సభ 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65.67 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం ఓటింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మహబూబ్‌బాద్, ఖమ్మం తదితర పది జిల్లాల్లో 70 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో ఎప్పటిలాగే 50 శాతం లోపు పోలింగ్ జరిగిందని తెలిపారు. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు గాను 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వికాస్‌రాజ్ తెలిపారు. ఇందులో ఓటర్ ఫెసిలిటీ సెంటర్లు, పోస్టల్ బ్యాలెట్, హౌం ఓటింగ్ ద్వారా 2,10,771 మంది ఓటేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గతేడాది కన్నా 2.90 శాతం పోలింగ్ పెరిగిందని వివరించారు. అసెంబ్లీ సెంగ్మెట్ల వారీగా చూస్తే అత్యధికంగా నర్సాపూర్‌లో 84.25 శాతం, అత్యల్పంగా మలక్‌పేటలో 42.76 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఓట్ల పరంగా చూస్తే మేడ్చల్ శాసన సభ నియోజకవర్గంలో అత్యధికంగా 3,85,149 ఓట్లు నమోదు కాగా, అత్యల్పంగా భద్రాచలంలో1,05,383 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. ఈవీఎంలను మూడంచెల భద్రత, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ కోసం ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్రంలో 34 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.