నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు రెండోరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. పేపర్-1 జనరల్ ఎస్సే పరీక్ష విజయవంతంగా ముగిసిందని తెలిపింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 31,403 మంది అభ్యర్థులకుగాను 21,817 (69.4 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఈనెల 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షను జూన్ తొమ్మిదిన నిర్వహించింది. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 3.02 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 31,383 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికయ్యారు.