– భారీ మూల్యం చెల్లిస్తున్న బాల్యం ఐక్యరాజ్య సమితి ఆందోళన
– మానవ కవచంలా మారుతున్న పాలస్తీనియన్లు ?
గాజా : గాజాపై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడుల్లో గత 48గంటల్లో 69మంది మరణించారని, 212 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. గత పది మాసాల కాలంలో 40,334మంది మరణించగా, 93,356మంది గాయపడ్డారు. గాజా దాడులకు పాలస్తీనా బాలలు అతి భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారని ఐక్యరాజ్య సమితి అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గాజాలో కీలకమైన మానవతాసాయం అందడం లేదు. దీంతో పిల్లల్లో పోషకాహార లోపం తీవ్రంగా పెచ్చరిల్లుతోందని విమర్శించారు. మరోపక్క ఉత్తర గాజాలోని ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్ మిలటరీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి ఉత్తర, సెంట్రల్, దక్షిణ గాజా ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు కొనసాగుతున్నాయి. జులై 22 నుండి ఇప్పటివరకు గత నెల రోజుల కాలంలో ఇజ్రాయిల్ మిలటరీ ఏకంగా 13సార్లు ప్రజలను ఆయా ప్రాంతాల నుండి ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. దక్షిణ గాజాలో ఇటువంటి ఆదేశాలు మరీ వేగంగా చోటు చేసుకున్నాయి. వెంటవెంటనే వస్తున్న ఈ ఆదేశాలతో వందలు వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ఇప్పటికే కిక్కిరిసి పోయి వున్న శిబిరాల్లోనే తల దాచుకుంటున్నారు. ఇటీవలి ఆదేశాలు వెలువడని సమయానికే శిబిరాల్లో అస్సలు చోటు లేకుండా పోయింది. ఆహారం, నీరు, మందుల సరఫరాల కొరత తీవ్రంగా నెలకొంది. ఆకలి తీవ్రత ఎంతలా వుందో తెలియచేసే ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇసుకలో పడిపోయిన గోధుమ పిండిని ఎత్తడానికి ఇద్దరు పిల్లలు తంటాలు పడుతున్న దృశ్యం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.