69 ఏండ్లు వెనక్కి!

69 years back!– పాలస్తీనాలో రెట్టింపైన దారిద్య్రం
– 2.5 లక్షల ఆహార ట్రక్కులు నిలిపివేత
– గాజాలో 45మంది మృతి
– హిజ్బుల్లా ఆర్థికమూలాలే లక్ష్యంగా దాడులు
గాజా, బీరుట్‌ : పాలస్తీనా భూభాగంలో ఈ ఏడాది దారిద్య్రం రేటు రెట్టింపై 74.3శాతానికి చేరిందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) పేర్కొంది. మానవ వికాసానికి సంబంధించిన కీలక అంశాలను సమీక్షించే మానవ వికాస సూచిక (హెచ్‌డిఐ)ని విడుదల చేశారు. దీని ప్రకారం 69ఏళ్ళ సుదీర్ఘ కాలంలో సాధించిన ప్రగతి అంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయిందని, 1955నాటి పరిస్థితులకు పడిపోయిందని యుఎన్‌డిపి అంచనా వేసింది. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో పరిస్థితి 16ఏండ్లకు పూర్వం ఎలా వుండేదో అలా వుందని పేర్కొంది. గాజాలోకి మానవతా సాయం రాకుండా ఇజ్రాయిల్‌ అడ్డుకుంటోందని గాజాలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది. ఏడాది క్రితం దాడులు ఆరంభమైన తర్వాత ఇప్పటివరకు దాదాపు రెండున్నర లక్షల సహాయ ట్రక్కులను నిలిపివేసిందని పేర్కొంది. ఆకలితో అలమటించి చనిపోవాలన్నదే ఇజ్రాయిల్‌ వ్యూహంగా వుందని, అందుకే ఆహారం, పాలు, ఇతర పోషక పదార్దాలను లోపలకు రాకుండా అడ్డుకుంటోందని విమర్శించింది. దాడులు ప్రారంభం కాకముందు గాజాలోకి ప్రతి రోజూ దాదాపు 500 ట్రక్కుల సహాయం వచ్చేది. తక్షణమే గాజాలోకి మానవతా సాయం అందేలా చూడాలని యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ చీఫ్‌ ఫిలిప్‌ లాజారిన్‌ కోరారు. మంగళవారం ఉదయం నుండి జరిగిన దాడుల్లో 45మంది మరణించారని, వీరిలో 37మంది ఉత్తర గాజాలో మరణించారని దీంతో గత 48గంటల్లో గాజాలో మరణించిన వారి సంఖ్య 115కి చేరగా, 487మంది గాయపడ్డారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు బీరుట్‌లోని రఫిక్‌ హరిరి యూనివర్శిటీ ఆస్పత్రికి సమీపంలో ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో 13మంది మరణించారు. 57మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
బీరుట్‌ ఆస్పత్రి భూగర్భంలో హిజ్బుల్లా రహస్య బంకర్‌
బీరుట్‌లో అల్‌ సహెల్‌ ఆస్పత్రి కిందన నిర్మించిన రహస్య బంకర్‌లో హిజ్బుల్లా లక్షలాది డాలర్ల నగదు, పెద్ద మొత్తంలో బంగారం నిల్వ చేసిందని ఇజ్రాయిల్‌ మిలటరీ వెల్లడించింది. అయితే తక్షణమే ఆ బంకర్‌పై దాడి చేసే ఆలోచన లేదని పేర్కొంది. అయితే ఆస్పత్రిని ఖాళీ చేయిస్తున్నట్లు లెబనాన్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో లెబనాన్‌ ఎంపి, ప్రస్తుతం బంకర్‌ వుందని పేర్కొంటున్న అల్‌ సహెల్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ ఫది ఆలమ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, కావాలంటే లెబనాన్‌ ఆర్మీ ఆస్పత్రిలో పర్యటించవచ్చని, రోగులు, ఆపరేషన్‌ థియేటర్లు తప్ప ఇక్కడ ఇంకేమీ లేవని చెప్పారు. బీరుట్‌ లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన దాడిలో నలుగురు మరణించారు.
హిజ్బుల్లా ఆర్థిక మూలాలపై దాడులు
కాగా హిజ్బుల్లా ఆర్థిక వనరులే లక్ష్యంగా దాడులను ఉధృతం చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. హిజ్బుల్లా ఆర్థిక విభాగమైన అల్‌ ఖర్ద్‌ అల్‌ హసన్‌కి చెందిన 30 స్థావరాలపై ఆదివారం రాత్రి, సోమవారం దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్‌ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ హెర్జి హలెవి తెలిపారు. ఇంకా ఈ దాడులు కొనసాగుతాయని చెప్పారు.
హిజ్బుల్లా ఆర్థిక విభాగ చీఫ్‌ను చంపేశాం
హిజ్బుల్లా గ్రూపునకు ఆర్థిక వ్యవహారాలు చూసే కమాండర్‌ను సిరియాలో మట్టుబెట్టినట్లు ఇజ్రాయిల్‌ ఆర్మీ ప్రకటించింది. కమాండర్‌ పేరును వెల్లడించలేదు. హిజ్బుల్లా యూనిట్‌ 4400 కొత్త కమాండర్‌ అయిన ఆ వ్యక్తి ఇరాన్‌ చమురు అమ్మకాల ద్వారా వచ్చిన నిధులను హిజ్బుల్లాకు బదిలీ చేసే వ్యవహారాలు చూస్తారని ఆర్మీ ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది గంటల క్రితమే ఆ వ్యక్తిని తుదముట్టించామని చెప్పారు. ఈ యూనిట్‌కు గతంలో కమాండర్‌గా వున్న మహమ్మద్‌ జాఫర్‌ను కూడా అక్టోబరు తొలి వారంలో జరిపిన దాడుల్లో చంపేశామని ఆ ప్రకటన పేర్కొంది.