– 2033-34 నాటికి 275 మిలియన్ టన్నులు
– ఐఎస్‌ఎ స్టీల్ ఇన్‌ప్రాబిల్డ్ సమ్మిట్ ప్రారంభం
హైదరాబాద్: వచ్చే దశాబ్దకాలంలో స్టీల్ డిమాండ్ ప్రతీ ఏడాది సగటున 5-7.3 శాతం పెరగొచ్చని అంచనా. శుక్రవారం హైదరాబాద్‌లో ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్ ఇన్‌ఫ్రాబిల్డ్ రెండో ఎడిషన్ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డెలాయిట్ ఓ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 2033-34 నాటికి దేశంలో 221-275 మిలియన్ టన్నుల స్టీల్ అవసరం అవుతుందని అంచనా. 2022-23లో ఉక్కు వినియోగంలో 41 శాతం వాటాతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్నాటక, తమిళనాడు టాప్‌లో ఉన్నాయి. 2013-14 నుంచి 2023-24 కాలంలో ప్రతీ ఏడాది స్టీల్ వినియోగంలో 5.67 శాతం చొప్పున పెరుగుదల చోటు చేసుకుంది. 2022-23లో తెలంగాణలో స్టీల్ వినియోగం ఏకంగా 15.75 శాతం పెరిగి 5,475 మిలియన్ టన్నులుగా చోటు చేసుకుందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
సెయిల్ రూ.6500 కోట్ల పెట్టుబడులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వ రంగంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) సిఎండి అమరెండు ప్రకాష్ తెలిపారు. 2030 నాటికి విస్తరణ కోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడుల వ్యయం చేయనున్నామన్నారు. ఈ సదస్సుకు ఉక్కు మంత్రిత్వ శాఖ, వరల్డ్ స్టీల్ అసోసియేషన్ మద్దతు అందిస్తున్నాయి. కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా, ఐఎస్‌ఏ ప్రెసిడెంట్ నవీన్ జిందాల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య సహా వివిధ ఇన్‌ఫ్రా కంపెనీల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.