రిలయన్స్‌ రిటైల్‌ అప్పుల్లో 73 శాతం పెరుగుదల

 Reliance Retail Loans A 73 percent increaseన్యూఢిల్లీ : ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌ఎల్‌) అప్పులు భారీగా పెరిగిపో తున్నాయి. 2022-23లో ఈ సంస్థ రూ.32,303 కోట్ల అప్పులు తీసుకుం దని ఎకనామిక్‌ టైమ్స్‌ ఓ కథనంలో వెల్లడించింది. వేగంగా వ్యాపార విస్తరణ కోసం ఈ రుణ నిధులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థ మొత్తం అప్పులు 73 శాతం పెరిగి రూ.70,943 కోట్లకు చేరాయి. 2021-22 ముగింపు నాటికి రూ.40,756 కోట్ల అప్పులను కలిగి ఉంది. తాజా వార్షిక నివేదికలో రూ.19,243 కోట్లు దీర్ఘకాల రుణాలున్నాయి.
”గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ రిటైల్‌ కొత్తగా 3,300 కొత్త అవుట్‌లెట్‌లను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కు చేరాయి. ఈ ఏడాది కూడా వేగవంతమైన విస్తరణ కొనసాగనుంది. జనసాంద్రత కలిగిన చిన్న పట్టణాల్లోనూ విస్తరించనున్నాము.” అని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఓ రిలయన్స్‌ ప్రతినిధి పేర్కొన్నారు. బ్యాంక్‌ల అప్పులను వచ్చే ఏడాది కాలంలోనే తిరిగి చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల ఆర్‌ఆర్‌విఎల్‌లో 0.99 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.8,278 కోట్ల నిధులను సమీకరించింది. వచ్చే కొన్ని నెలల్లో 8-10 శాతం వాటాలను అమ్మే యోచనలో ఉందని సమాచారం. ”రిలయన్స్‌ రిటైల్‌ యొక్క దీర్ఘకాలిక రుణాల పెరుగుదల కారణంగా స్టోర్‌ల నిర్వహణ సామర్థ్యాన్ని విస్తరించేందుకు, జియోమార్ట్‌ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్థి చేయడానికి నిధులు సమకూర్చుకుంది.” అని బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు మోహిత్‌ యాదవ్‌ అంచనా వేశారు.