తొలిరోజు 7,46,414 అభయహస్తం దరఖాస్తులు

– సీఎస్‌ శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజా పాలన ప్రారంభమైన మొదటి రోజు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులను స్వీకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుంచి 4,57,703 దరఖాస్తులు స్వీకరించామని వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై ఆమె గురువారం జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ప్రతీ కేంద్రంలోనూ సరిపడా ఆరు గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సభలకు వచ్చే వారికి కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ వంద మందికి ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా పాలనలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్‌ ఇవ్వాలని మరోసారి స్పష్టం చేశారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకుగాను ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌, పంచాయితీ రాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్‌, సందీప్‌ సుల్తానియా పాల్గొన్నారు.