కొలంబో : శనివారం జరిగిన కీలకమైన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 75శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని, భద్రతా ఉల్లంఘనలు నమోదు కాలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది. 4గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. ఆ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు ప్రారంభమైన రెండు మూడు గంటలతర్వాత ఫలితాలు వస్తాయని కొలంబో నగర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ బందారామప తెలిపారు. ఓటింగ్‌ను పురస్కరించుకుని శ్రీలంక, న్యూజీలాండ్ మధ్యజరిగే టెస్ట్ మ్యాచ్‌కు కూడా ఒక రోజు బ్రేక్‌ఇచ్చారు. 85 ఫిర్యాదులు అందాయని, వాటిని నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సమస్యలే కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీలో వున్న ముగ్గురు అభ్యర్ధులు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై హామీలిచ్చారు.