75 ఏళ్ల కిందట, 1949, అక్టోబర్ 1న చైనాలో ప్రజారాజ్యం ఏర్పాటును ప్రపంచానికి ప్రకటించాడు, మావో జెడాంగ్. తాము పురుడుపోసిన ఈ నూతన సమాజానికి, ‘సోషలిస్ట్ రిపబ్లిక్’ అన్నపేరు పెట్టలేదు. ఈ సరికొత్త చైనాకి పీపుల్స్ రిపబ్లిక్ అని నామకరణం చేశారు కమ్యూనిస్టులు. ఇప్పుడే ఏర్పడిన ఈ ప్రజారాజ్యం, వెనువెంటనే సామ్యవాద దేశంగా మారబోదన్నది చైనా కమ్యూనిస్టు పార్టీ అంచనా. 1931లో జపాన్ సామ్రాజ్య వాదులు ఉత్తర చైనాను ఆక్రమించినప్పుడు మొదలై పద్ధెనిమిదేళ్ల పాటు మండిన యుద్ధపు మంటల్లో కోటి 50 లక్షల మంది బలయితే, ఆ శిధిలాలపై కొత్త రాష్ట్రాన్ని, సమాజాన్ని నిర్మించడానికి నడుముకట్టిన కమ్యూనిస్టులకు సామ్యవాద సమాజానికి దారితీసే ఆ తోవపై దశాబ్ధాల ప్రయాణం ముందున్నదన్న విషయంపై ఆనాడే స్పష్టత ఉంది.’ఇకపై చైనా ప్రపంచంలో శాంతి, స్వేచ్ఛలని కోరుకునే ప్రపంచ దేశాలన్నిటికీ చెందుతుంది’ అని 1949, సెప్టెంబర్ 21న జరిగిన చైనా ప్రజా రాజకీయ సంప్రదింపుల సభ (చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్) మొదటి ప్లీనరీ సమావేశంలో మావో ఎలుగెత్తి చాటాడు. ఒడిదుడుకులకు తలొగ్గక, శాయశక్తులా తమ నాగరికత అభివృద్ధికి, ప్రజాశ్రేయస్సు పెంపునకు పాటు పడుతూనే; నూతన చైనా ప్రపంచశాంతి, స్వేచ్చలకి దన్నునిస్తుందని ప్రకటించాడు. ‘మనం సగర్వంగా నిలబడ్డాం! ఇకపై అవమానాలు, తలవంపుల కింద మన దేశం నలగబోదు’ అని ఉద్ఘాటించాడు. ఆ సభలో మావో అన్నమాటలు, ఆనాడు ప్రపంచమంతటా జరుగుతున్న సామ్రాజ్య వాద వ్యతిరేక ఉద్యమాల ఆశయాలకు ప్రతిబింబం. భారతదేశంలో నెహ్రూ కాని, ఈజిప్టులో గమాల్ అబ్దుల్ నాస్సర్ కాని, ఆనాటి వలసపాలన వ్యతిరేక జాతీయోద్యమ నాయకులందరి గొంతుల్లో, ఇవే భావాలు పలికేవి. వలసపాలన అవశేషాలు మిగలకుండా ముగియడానికి ప్రపంచశాంతి, సమతలు ఎంతైనా అవసరం. శాంతి, సమతల నీడనే, ఉక్కుపాదం కిందనుండి బయటపడిన ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడగల సమాజాల్ని నిర్మించుకోగలరు. 2024లో, ఆనాడు మావో ఇచ్చిన సందేశం నెమరువేసుకుంటూ, మనచుట్టూ చూస్తే -వలసపాలన నుండి స్వాతంత్య్రం సాధించిన దేశాలు ఎన్ని ముందడుగులు వేశాయో, అదే సమయంలో, ఎంత మొండిగా అవే వలసవాద, సామ్రాజ్యవాద శక్తులు ఇప్పటికీ ఈ దేశాల ప్రగతిని అడ్డగిస్తున్నాయో కనిపిస్తుంది.ఈ రోజు పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణ కాండ, ఇజ్రాయిల్ చేతిలో భీకరమైన బాంబు దాడులకి గురవుతున్న లెబనాన్ – మనల్ని, తునకలు చేసి బయటికి రావాలనుకున్న వలస వాద గతంలోనే కట్టి ఉంచు తున్నాయి. సామ్రాజ్యవాద దేశాలు మనపై రద్దుతున్న యుద్ధాలు, మావో వక్కాణించిన ‘నాగరికతల అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు’, ‘ప్రపంచ శాంతి, స్వేచ్ఛ’ లకు అడ్డంకులు. వలసవాదం కింద నలిగిన బయటపడిన దేశాల ముందు రెండు దారులున్నాయి.
ఒకరినొకరు ప్రత్యర్ధులుగా చూస్తూ, మన సంపద, శక్తులని వినాశకర యుద్ధాలకి తగలపెట్టడమా, లేక మావో అన్నట్లు స్వేచ్ఛాప్రియ దేశాలతో అంతర్జాతీయ శాంతికాముక సమాజాన్ని నిర్మించడమా! సామ్రాజ్యవాద దేశాల కంపెనీలకు అతి చౌక ధరల్లో ముడి వస్తువులు సరఫరా చేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్న మూడవ ప్రపంచ దేశాలు, తమ శ్రామికుల వేతనాలు తొక్కిపెడితే – వారి శ్రమని దోచి బహుళ జాతి కంపెనీలు భారీ ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నాయి. ప్రపంచ కార్మికులని దోచి కూడగట్టిన ఈ లాభాలని కొత్త టెక్నాలజీల అభి వృద్ధిపై వెచ్చించి, తమదేశాల ఉత్పత్తి శక్తుల్ని బలపరచుకుంటూ, టెక్నాలజీ పోటీలో ముందుంటూ, ఆధిపత్యం చెలాయిస్తున్న వీటి గుప్పిటనుండి మూడో ప్రపంచ దేశాలు బయటపడి, స్వయం ప్రతిపత్తి పెంచుకోవడం ఎలా? చాలీచాలని వేతనాలు, కొనుగోలు శక్తి లేని ఆర్ధిక వ్యవస్థలో చిక్కుకున్న ఈ దేశాలు, అభివృద్ధికి అవసరమైన వనరులు ఎలా సమకూర్చుకుంటాయి? ఈ సమస్యని అధిగమించడానికి చైనాతో సహా, కొన్ని దక్షిణాది దేశాలు తమ తమ మార్గాలు ఎంచుకున్నాయి. ఈ విషయంలో చైనా అనుభవం చర్చించ దగ్గది. విప్లవం తరువాత చైనా తన దగ్గర ఉన్న కొద్దిపాటి వనరులు నేర్పుగా కూడగట్టుకుని, సోషలిస్ట్ రష్యా సహాయంతో పాత భూస్వామ్య వ్యవస్థను పెకిలించి, కొత్త వ్యవసాయిక వ్యవస్థకి పునాదులు వేసి, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే విద్య, వైద్య వ్యవస్థలని దేశవ్యాప్తంగా నిర్మించి జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచింది. 1949, 1978 మధ్య సమయం చైనా అభివృద్ధి మొదటి దశ. ఈ కాలంలో చైనాలో ఏర్పడిన సమానత్వంవల్ల , విద్యావంతులై, ఆరోగ్యంతో ఉన్న జనాభా నిష్పత్తి తక్కిన మూడో ప్రపంచ దేశాల కన్నా చాలా ఎక్కువగా ఉండేది.
రెండవ దశలో 1979 నుండి, విద్య, నైపుణ్యం, ఆరోగ్యాలలో ముందున్న ఈ శ్రామికవర్గం ఆధారంగా చేసుకుని ప్రభుత్వం బహుళ జాతి కంపెనీల పెట్టుబడులని ఆకర్షించింది. ప్రణాళికాబద్ధంగా, సాంకేతిక పరిజ్ఞానం స్థానిక కంపెనీల చేతిలోకి మారేట్లుగా, చైనాలోకి పెట్టుబడి తెచ్చిన విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దేశ కరెన్సీ వినమయ ధరని మార్కెట్ శక్తులకి వదిలేయకుండా, ప్రభుత్వం అదుపు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలను ఈ నూతన సాంకేతిక అభివృద్ధిలో భాగంగా చేసింది. ఉదారవాద అంత ర్జాతీయ వ్యవస్థ పరిధిలో ఉంటూనే, సాంకేతిక పరిజ్ఞానం కోసం సామ్రాజ్యవాద దేశాలపై ఆధారపడే అవసరాన్ని అధిగమించి చైనా సాధించిన గణనీయమైన ఆర్ధిక, సాంకేతిక అభివృద్ధులకు కారణం పైన తెలిపిన ప్రణాళికలు. నేడు అంతర్జాతీయంగా ఓ సగటు మనిషి జీవితకాలం 73 ఏండ్లు. చైనా ఈ సగటుని ఎప్పుడో మించిపోయింది. చైనాలో వ్యవస్థ కొలబద్దగా తీసుకునే కాల ప్రమాణాలే వేరు. కొన్నేండ్ల క్రిందట ఒక చైనా ప్రభుత్వాధికారి, చైనా తొందరలో భూగర్బ ఇంధనాలపై ఆధారపడని ఆర్ధిక వ్యవస్థలోకి వెళుతుందని నాతో అన్నాడు. అంత తొందరగా ఎలా అవుతుంది? అని నేనడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ దిశగా వేసిన ప్రణాళిక, దానికి చేకూర్చుకుంటున్న వనరులగురించి వివరించి, వచ్చే యాభై ఏళ్లలో ఇది పూర్తవుతుందని చెప్పాడు.గట్టిగా పట్టుబట్టి చేస్తే పీపుల్స్ రిపబ్లిక్ చైనా, శతజయంతి సమయానికి ఈ ఆశయం సాధించగలమని అన్నాడు. ఇలా పదుల ఏండ్లు పట్టే దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయగల ఆత్మవిశ్వాసం, పెట్టుబడిదారీ వ్యవస్థని నడిపే స్వల్పకాలిక ప్రయోజనాల చెరబయట ఉన్న, చైనా సమాజంలోనే సాధ్యం.
20 ఏండ్ల కిందట బీజింగ్‌లో తామరతంపరగా పెరిగిన కార్లు, చలికాలపు బొగ్గు వాడకం వల్ల, ఆ మహా నగరంలో పొగ మంచుతో కూడిన విషపుగాలులు వీచాయి. ఆ తరువాత వచ్చిన పంచ వర్ష ప్రణాళికలల్లో ఆర్ధిక పారిశ్రామిక అభివృద్ధి వల్ల పర్యావరణం హాని జరగ కూడదని చేసిన తీర్మానం అమలు పరుస్తూ, ప్రభుత్వం బీజింగ్‌లో రైలు, బస్సు ఇతర ప్రభుత్వ రవాణా వ్యవస్థను మెరుగుపరిచి, బీజింగ్ వాసులు తమ అవసరాలకు కాలినడకన వెళ్లగలిగే విధంగా పట్టణ ప్లానింగ్ చేయసాగింది. ప్రపంచంలోఉన్న 3,85,000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 99 శాతం చైనా పట్టణాల్లో ఉన్నాయి. వీటిలో 6584 ఒక్క బీజింగ్‌లోనే ఉన్నాయి. ఈ ప్రయత్నాల వల్ల బీజింగ్‌లో కాలుష్యం చాలా తగ్గింది. ఇప్పటికీ మెరుగుపడుతూనే ఉంది. బీజింగ్ పై ఉన్న రెండుకోట్ల పైచిలుకు జనాభా వల్ల పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడానికి, మరో పట్టణాన్ని కట్టి, బీజింగ్‌లో ఉన్న వివిధ సంస్థల్ని, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, వైద్య, విత్త సంస్థలు మొదలైన వాటిని – ఈ కొత్త పట్టణానికి తరలించాలని పదేళ్ళ క్రితం చైనా ప్రభుత్వం నిర్ణయించింది. బీజింగ్ నుండి 100 కిమీ దూరంలో, హెబై ప్రాంతంలో, జోంగ్‌ఆన్ లో అదే పేరుతో కొత్త పట్టణాన్ని మొదలుపెట్టింది. పునాదులనుండి పోస్తున్న ఈ కొత్త పట్టణాన్ని భూగర్భ ఇంధనాల వాడుక లేకుండా, అంతటా పచ్చదనం ఉండేలా నిర్మించాలని ప్రణాళిక వేసింది. జోంగ్‌ఆన్ ప్రాంతంలో అతి ముఖ్యమైన బయ్యాంగ్డియన్ సరస్సు ఉంది. ఆ సరస్సు పరిసరాలు చైనా మొత్తంలోనే అతిపెద్ద చిత్తడినేలలు. ఈ క్రమంలో ఆ సరసు ప్రాంతాన్ని 170 చదరపు కిమీ నుండి 300 లకి పెంచి, ఆ నీరు తాగ డానికి యోగ్యం చేశారు. అంతరించిపోతున్న బాయర్స్ పోచర్డ్ అనే ఆ ప్రాంతపు బాతుల సంఖ్యను పునరుద్ధరిం చారు. ఇప్పుడు ఆ చిత్తడి నేలల్లో అంతటా ఇవి దర్శనిమస్తాయి.
జోంగ్‌ఆన్ కొత్త పట్టణంలో నగర కట్టడాలు, దట్టమైన హరిత ప్రాంతం, అన్నీ మిళితమై ఉంటాయి. కొత్త అటవీ వనాలు, పెద్ద పట్టణ పార్కులు, నివాస ప్రాంతాల్లో కమ్యూనిటీ పార్కులు, అలాగే నగరమంతా చిరుపార్కులతో -జోంగ్‌ఆన్ మూడు అంచెల నగరంగా ఎదగబోతోంది. మొదటి అంచెగా నేలపైన నివాస స్థలా లు, ఆఫీసులూ; రెండో అంచెగా నేలకింద ఉన్న వ్యాపార-వాణిజ్య ప్రాంతాలు, జన రవాణా, కరెంటు, ఆప్టిక్ కేబుల్, నీరు, విద్యుత్, గ్యాస్, మురుగునీటి వ్యవస్థలు; మూడవ డిజిటల్ అంచెపై రెంటినీ సమన్వయం చేసి, కొత్త రవాణా వ్యవస్థకి కావాల్సిన డాటాని అందించి, సెన్సర్లతో ఆయా వ్యవస్థల పరికరాలని సమీక్షిస్తుంది. వయసు పైబడినవారి అవసరాలను పర్యవేక్షిస్తుంది. మావోకి ఈ కొత్త పట్టణం బాగా నచ్చి ఉండేది.. తన 75 ఏళ్ల విప్లవాత్మక పయనంలో చైనా గొప్ప ముందంజలు వేసింది. ఈ ప్రక్రియలో పట్టించుకోవాల్సిన కొత్త, పాత సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలపై మేము నడిపే ‘వెన్హువా జోంగ్ హంగ్’ ఇంటర్నెట్ పత్రికలో జరిగే చర్చలు మీరు చదవవచ్చు. ఇన్ని సమస్యలున్నా, మూడో ప్రపంచపు దేశాలను కట్టి ఉంచుతున్న సామ్రాజ్యవాద ఆర్ధిక సంకెళ్లని తెంచుకుని ముందుకు పోతున్న చైనా సాధించిన విజయాలపై లోతైన అవగాహన కోసం కూడా చర్చ అవసరం.
– విజయ్ ప్రసాద్