ముట్టడిలో 75 ఏండ్ల మన రాజ్యాంగం

75 years under siege Our Constitutionరాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేస్తున్న వారే దాని సూత్రాల్ని బలహీన పరుస్తున్నారు. డెబ్భై ఐదవ యేటా భారత రాజ్యాంగం చర్చనీయాంశగా మారింది. పార్లమెంటరీ చర్చల్లో, ఎన్నికల్లో ఒక అంశంగా, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఉపన్యాసాల్లో ఇది కేంద్ర బిందువుగా మారుతోంది. రాజ్యాంగాన్ని రచించిన వ్యవస్థాపక సభ్యులకు ఇది నివాళి. ఇది పరీక్షా సమయంలో నిలబడడమే కాక, దాని ముఖ్యమైన విలువల్ని నిలబెట్టడం అనేది తప్పనిసరిగా దేశభక్తియుతమైన కర్తవ్యంలో భాగంగా మారింది. అంటే దీని అర్థం, భారతదేశ ప్రజలంతా సమానంగా రాజ్యాంగం నుండి ప్రయోజనం పొందుతున్నారని కాదు. దానిలో పొందుపరచ బడిన హక్కుల అమలుతీరు లోపభూయిష్టంగానూ, అసమానంగానూ ఉంది. ఇది పాక్షికంగా రాజ్యాంగంలో అహేతుకంగాను, ఏకపక్షంగాను, న్యాయసంబంధమైన, న్యాయసంబంధం కాని భాగాలుగా విభజించారు. సామాజిక, ఆర్థిక న్యాయానికి సంబంధించిన ముఖ్య నిబంధనలను ఆదేశిక సూత్రాలలో న్యాయ సంబంధం కాని విభాగాలకు తరలించారు. కాబట్టి పౌరులందరికీ సమాన హక్కుల హామీ విషయంలో ఒక నమూనాగా పరిగణించబడే రాజ్యాంగాన్ని కలిగి ఉన్న భారతదేశం నేటికీ కూడా రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత అసమానమైన సమాజాల్లో ఒకటిగా అభివద్ధి చెందిం ది. కొందరు రాజ్యాంగ పరిషత్‌ సభ్యుల ఆందోళనల్ని స్వయం ప్రకటిత సోషలిస్ట్‌ అయిన కె.టి.షా తన మాటల్లో ఇలా వ్యక్తీకరించారు. ‘అలాంటి ఒక విభజన సంబంధిత బ్యాంకు తన సౌకర్యార్థం చెల్లించే చెక్కువలె ఉంటుందనేది నిజమని తేలింది. రాజ్యాంగ పరిరక్షణలో ఆర్థిక సమానత్వం,ఆర్థిక న్యాయానికి సంబంధించిన ఆదేశికసూత్రాల స్ఫూర్తిని తప్పకుండా అమలు జరపాలి’.
26 నవంబర్‌ 1949న రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌,’రాజ్యాంగ పరిషత్‌చే తీర్మానించబడిన రాజ్యాంగాన్ని ఆమోదించండి’ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, దానిని ఏకగ్రీవంగా ఆమోదించిన తరుణంలో ‘సుదీర్ఘమైన హర్షధ్వానాలు’ సభ రికార్డుల్లో నమోదయ్యాయి. రాజ్యాంగ పరిషత్‌ వెలుపల ఆరెస్సెస్‌,ఈ రాజ్యాంగం మనుస్మతి లాంటి మత గ్రంథాల ఆధారంగా ఉన్న ‘భారతీయ’ సాంప్రదాయాల కనుగుణంగా లేదని, ఆమోదించబడిన భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది.
జాతీయత, పౌరసత్వ హక్కులు మెజారిటీ మత గుర్తింపుతో ముడిపడి ఉంటాయనీ, హిందూ విశ్వాసాలను ఆమోదించి, ఆచ రించే వారికి,’ఇతరులు’ లొంగి ఉండకపోతే, వీరికి సమాన పౌరులుగా గుర్తించబడే హక్కు ఉండదని ఆరెస్సెస్‌ వాదించింది. రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా భారతదేశం ఈ విభజన సిద్ధాంతాలను నిరాకరించింది. మత ఆధారిత జాతీయతకు అనుగుణమైన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాన్ని అంగీకరించి, పాకిస్థాన్‌ కూడా ఆ సిద్ధాంతానికి అనుగుణంగానే తన పాలనా విధానాన్ని, రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. సమస్య ఏమిటంటే, డెబ్భైఐదు సంవత్సరాల తరువాత, హిందూ రాజ్యస్థాపన ఎజెండాను, ఆ విశ్వాసాలను ఆరెస్సెస్‌ కొనసాగిస్తూ ఉంది. ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే, నేడు భారత దేశాన్ని పారిపాలిస్తున్న వారు, ఎన్నికల్లో విజయం సాధించేందుకు కూడా ఆరెస్సెస్‌ సంస్థాగతమైన నెట్‌ వర్క్‌ పై ఆధారపడుతున్నారు.
పదేండ్ల కాలంగా బీజేపీ ప్రభుత్వం, ఆరెస్సెస్‌ ఎజెండా పట్ల తన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అది, దుర్మార్గమైన మైనారిటీ వ్యతిరేక విధానాల్లో, ముస్లిం వ్యతిరేక చట్టాల్ని రూపొందించడంలో, ప్రతిపక్షాలపైన, ప్రశ్నించిన వారికి వ్యతిరేకంగా అనాగరిక చట్టాల్ని ప్రయోగించడంలో ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాలకున్న రాజ్యాంగ పరమైన హక్కులకు వ్యతిరేకంగా కేంద్రీకత ప్రభుత్వ రూపాలను ముందుకు తీసుకొని పోవడంలో, చరిత్ర మరియు సంస్కతులను వక్రీకరించడంలో, మనువాద హిందూత్వను ప్రోత్సాహించడంలో, కుల వ్యవస్థను పటిష్ఠపరచడంలో, తమ సిద్ధాంతానికనుగుణంగా ఉన్న వారిని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలలో నియామకాలలో ఆరెస్సెస్‌ హిందూత్వ ఎజెండా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగం పేరుతో అధికారాన్ని చేపట్టిన వారు లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరల్‌ వ్యవస్థ అనే మూల స్తంభాల పై ఆధారపడిన రాజ్యాంగ ప్రాథమిక మైన నిర్మాణాన్ని క్రమక్రమంగా బలహీనపరిచే విధానాలను అనుసరిస్తున్న పరిస్థితిని నేడు భారతదేశం ఎదుర్కొంటుంది.
దీన్ని ఒక ప్రత్యేకమైన నాయకుని వ్యక్తిత్వంలో ఉన్న పిచ్చి ఆత్మస్తుతిగా చూడటం పూర్తిగా తప్పు అవుతుంది. ఒక వ్యక్తి రాజ్యాం గానికి విరుద్ధమైన రాజకీయాలకు ప్రభావవంతమైన ప్రతినిధిగా ఉండి ఉండవచ్చు. కానీ అది వ్యక్తికి అతీతమైన రాజకీయం. అది సామాజిక,ఉన్నత వర్గాలలో లోతైన మూలాలను కలిగి ఉంటుంది. గతంలో ఎమర్జెన్సీ రూపంలో రాజ్యాంగంపై జరిగిన దాడి, ఇక్కడ ఉపయోగపడుతుంది. ఆ సమయంలో పౌరస్వేచ్ఛలు, ప్రాథమిక ప్రజాస్వామిక హక్కుల నిర్మూలనకు శక్తివంతులైన పెట్టుబడిదారులు మద్దతు పలికారు. చారిత్రాత్మక రైల్వే సమ్మెను అనుసరించి, దేశవ్యాప్తంగా వారి డిమాండ్ల సాధన కోసం ఉద్యమించే కార్మిక వర్గాలను మచ్చిక చేసుకునేందుకు హక్కుల నిర్మూలన అవసరమని పెట్టుబడి దారీ వర్గాలు విశ్వసించాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, జే.ఆర్‌.డీ.టాటా ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా స్పష్టంగా చెప్పాడు: ”విషయాలు చాలా దూరం పోయాయి.మేము ఇక్కడ ఏమి చేశామో మీరు ఊహించలేరు – సమ్మెలు, బహిష్కరణలు, ప్రదర్శనలు. పార్లమెంటరీ వ్యవస్థ మా అవసరాలకు తగినట్లుగా లేదు.” ఇందిరాగాంధీ తన సొంత ప్రయోజనాల కోసమో, లేక తన పార్టీ ప్రయోజనాల కోసమో రాజ్యాంగం పైన దాడి చేయలేదు, కానీ భారతదేశ పెట్టుబడిదారీ వర్గాల డిమాండ్లను సంతప్తిపరిచే ఒక విస్తతమైన లక్ష్యం ఉంది.
ప్రస్తుత తరుణంలో పాలకవర్గాలు, ప్రస్తుత పాలన తీరుపై విధేయతను చూపుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి.కాబట్టి ధనవంతులు, శక్తివంతులు వారి వారి విధేయతలను మార్చుకునే ఏర్పాట్లలో ఉండటం అసాధారణమైన విషయమేమీ కాదు. అయితే ప్రముఖ పారిశ్రామికవేత్తలు నాగపూర్‌ ప్రధాన కార్యాలయానికి తలవంచడం అనేది నాజీ పాలన ముందు వినమ్రపూర్వకంగా అభివాదం చేసిన బడా వ్యాపార సంస్థలను గుర్తుచేసే ఒక కొత్త లక్షణం. భారతదేశ కార్పోరేట్లు, ప్రస్తుత పాలకులు చెట్టాపట్టాలేసుకుని నడుస్తున్నారు.
అయితే ఈ పాలనలో అత్యంత అనుకూలమైన వ్యక్తులు ఉన్నారు. కానీ కార్పోరేట్ల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం సేవలు అందిస్తూ, ఆ ప్రయోజనాలను కాపాడుతుంది. నాలుగు లేబర్‌ కోడ్‌ల ద్వారా కార్మికుల హక్కులపై దాడులు చేయడం, రైతులను అణచివేయడం, పెద్ద మైనింగ్‌ కంపెనీలు లేదా ఇతర ప్రయివేటు రంగ ప్రాజెక్టుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు ఆదివాసీల భూములను బలవంతంగా లాక్కోవడం ద్వారా ఆదివాసీలపై అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించడం ఈ ప్రభుత్వం యొక్క కర్తవ్యం.
రాజ్యాంగాన్ని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ పాలన రెండు ఫిరంగులు-అధిక సంఖ్యాక ఆధిపత్యవాదం (మెజారిటేరియనిజం), కార్పోరేట్‌ ప్రయోజనాలు. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. రాజ్యాంగం ఆమోదించబడిన సందర్భంగా జరుపుకునే 75వ వార్షికోత్సవంలో ప్రతిఘటనతో పాటు పరిరక్షణ అనే ఈ రెండు అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.
(పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌,
9848412451
బృందాకరత్‌