– క్యూ1లో తగ్గిన మొండి బాకీలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 77.87 శాతం వృద్థితో రూ.418 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయం పెరగడంతో పాటుగా మొండి బాకీల కేటాయింపుల భారం తగ్గడంతో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. 2023-24 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 48.27 శాతం పెరిగి రూ.3,176 కోట్లుగా చోటు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,142 కోట్ల ఎన్‌ఐఐ నమోదు చేసింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీయేతర ఆదాయం 15.4 శాతం వృద్థితో రూ.959 కోట్లుగా చోటు చేసుకుంది. ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంక్ మొండి బాకీల కోసం రూ.823.5 కేటాయింపులు చేసింది. క్రితం క్యూ1లో రుణాల జారీ 12.95 శాతం పెరిగి రూ.2.19 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం డిపాజిట్లు 6.05 శాతం వృద్థితో రూ.3.63 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయి. 2023 జూన్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 4.95 శాతానికి తగ్గాయి. 2022 జూన్ ముగింపు నాటికి ఈ ఎన్‌పిఎలు 14.9 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పిఎలు కూడా 3.93 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గడంతో ఆ బ్యాంక్ ప్రగతి మెరుగుపడింది.