ఎన్నికల తనిఖీల్లో.. రూ.79 లక్షల నగదు పట్టివేత

ఎన్నికల తనిఖీల్లో.. రూ.79 లక్షల నగదు పట్టివేతనవతెలంగాణ-తాండూరు/కందుకూరు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బషీరా బాద్‌, కందుకూరు మండలాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. బషీరాబాద్‌లో రూ. 44 లక్షలు, కందుకూరులో రూ. 35లక్షల ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లో గురువారం అర్దరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా.. రైల్వే గేట్‌ సమీపంలో ఓ పత్రికా విలేకరి శెట్టి రవిశంకర్‌ వద్ద రూ. 44,84,500 పట్టుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో వాటిని సీజ్‌ చేశారు. కాగా, విలేకరి వద్ద డబ్బు దొరకడం తీవ్ర చర్చనీయాంశమైంది. విలేఖరి దగ్గర దొరికిన డబ్బులు కాంగ్రెస్‌కి చెందిన బియ్యని మనోహర్‌రెడ్డివి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. డబ్బును సీజ్‌ చేసి, నిందితుడిని అరెస్టు చేసినట్టు బషీరాబాద్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపారు.కందుకూరు- మీర్‌ఖాన్‌పేట మధ్య ఫార్మా రోడ్డులో ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. ఓ కారులో తరలిస్తున్న రూ. 35 లక్షలు డబ్బును పట్టుకున్నారు. కారులో డబ్బులు తరలిస్తున్నట్టు పోలీసు లకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టగా.. కారు తప్పించు కుంది. దాంతో దాన్ని వెంబడించి పట్టుకొని నగదును సీజ్‌ చేశారు. డబ్బు తరలి స్తున్న రెడ్డి యాదగిరి రెడ్డి, సభావాత్‌ బిచ్చా నాయక్‌, యాట నరసింహను అదుపులోని తీసుకున్నారు. వారిని విచారించగా డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపలేదని సీఐ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. అయితే కారులో కల్వకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి సంబంధించిన కరపత్రాలు ఉండటంతో ఆ డబ్బులు అతనికి సంబంధించినవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.