న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)గాను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్)పై 8.15 శాతం వడ్డీ చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఇపిఎఫ్‌ఒ సోమవారం ఓ సర్క్కూలర్ జారీ చేసింది. ఇపిఎఫ్ పథకం- 1952లోని 60 (1) పేరా కింద ప్రతి సభ్యుని ఖాతాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలియజేసిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలియజేసినట్లు తెలిపింది. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఏకంగా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి కేవలం 8.10 శాతం వడ్డీ రేటు మాత్రమే ఇచ్చింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇపిఎఫ్ ఖాతాలపై ఇదే అతి తక్కువ వడ్డీ రేటు కావడం గమనార్హం. 2022-23గాను ఇపిఎఫ్‌పై 2023 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలోనే వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ఈ దఫా కేంద్రం ఆలస్యంగా ఆమోదం తెలపడం గమనార్హం. దేశంలోని 7.5 లక్షల కంపెనీలు ఇపిఎఫ్‌లో 7.02 కోట్ల మంది చందాదారులకు సొమ్ము జమ చేస్తున్నాయి.