నవతెలంగాణ-చేర్యాల: పాత ప్లాన్ ప్రకారమే దేవాదుల 8 ఆర్ కాలువ నిర్మాణం చేపట్టాలని కొత్త ప్లాన్ ప్రకారం కాలువ నిర్మాణం చేపడితే తమ భూములను కోల్పోతామని సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో గత వారం రోజుల నుండి రైతులు చేస్తున్న ఆందోళనలతో శుక్రవారం దేవాదుల డిఈ రుద్ర, జెఈ స్మిత మున్సిపాలిటీ పరిధిలోని కెనాల్ ఓటిని,ముస్త్యాల శివారులో గతంలో తవ్విన కాలువను సందర్శించారు. ఈ కాలువపై వారికి ఉన్న అనుమానాల గూర్చి గతంలో ఉన్న అధికారులతో ఫోన్లో సంభాషించగా సిద్దిపేట జిల్లాలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఒక అధికారి సిఫారసు మేరకు గతంలో డిజైన్ చేసిన కాలువను రీ డిజైన్ చేసినట్లు అధికారులు ఫోన్లో సంభాషించుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని త్వరలోనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగిన న్యాయం చేస్తామని డిఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు కోంట్లం మల్లేశం,శ్రీను, బత్తెపు లింగం, బీర్ల నర్సయ్య, రవి,మహేష్, దాసరి అనిల్, పిల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.