9న బ్లాక్‌ డే

– బడ్జెట్‌ ప్రతుల దహనం, ప్రదర్శనలు, ధర్నాలకు ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ పిలుపు
న్యూఢిల్లీ: రైతు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఈ నెల 9న బ్లాక్‌ డే పాటించాలని ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శనివారం నాడిక్కడ ఆయా సంఘాల కేంద్ర కార్యాలయం (క్యానింగ్‌ లైన్‌ 36)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, కోశాధికారి పి కృష్ణప్రసాద్‌, రాజ్యసభ ఎంపీ, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి వి.శివదాసన్‌ మాట్లాడారు. క్రూరమైన రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ 9న బడ్జెట్‌ ప్రతులను దహనం చేయడం, దిష్టిబొమ్మల దహనం, ప్రదర్శనలు, ధర్నాలు, బహిరంగ సభలు తదితర కార్యక్రమాలను నిర్వహించడంతో ఈ బ్లాక్‌ డేని నిర్వహిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్‌ దేశంలోని పేద ప్రజలపై ప్రత్యేకించి రైతాంగం, శ్రామిక వర్గం, చిన్న ఉత్పత్తిదారులపై దాడి చేసిందని అన్నారు. ఉపాధి హామీ, ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, బీమా, నీటిపారుదల, వ్యవసాయం, కార్మికులు, అన్ని ఇతర సామాజిక రంగాలకు కేటాయింపుల్లో భారీగా కోతలు పెట్టటం దారుణమన్నారు. 2023 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న తన వాగ్దానాన్ని ప్రధాని మోడీ విస్మరించారని చెప్పారు. దేశంలోని 81 కోట్ల మంది ప్రజలకు బియ్యం, గోధుమలను వరుసగా రూ. 2, రూ. 3 చొప్పున సబ్సిడీ నిరాకరించారని తెలిపారు. ఎంఎస్పీ చట్టబద్ధతతో సేకరణ వ్యవస్థ, పేద, మధ్యతరగతి రైతాంగం, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ కోసం బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఉపాధి హామీ కింద రోజుకు రూ.600 కనీస వేతనంతో 200 పనిదినాలు కల్పించాలనే డిమాండ్‌ తిరస్కరించబడిందని అన్నారు.
నరేంద్ర మోడీ ఎనిమిదేండ్ల పాలనలో ప్రపంచ పేదరిక సూచీలో భారతదేశం స్థానం 55వ ర్యాంక్‌ నుంచి 107వ ర్యాంక్‌కు దిగజారిందని విమర్శించారు. నయా ఉదారవాద విధానాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ దేశాలలో మాంద్యాన్ని పెంచాయని, 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత మందగించనుందని ఐఎంఎఫ్‌ తెలిపిందని అన్నారు. దేశ ప్రజలపై ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవస్థాగత సంక్షోభ ప్రభావాన్ని కేంద్ర బడ్జెట్‌ ప్రస్తావించ లేదనీ, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ధనవంతులపై పన్ను విధించడానికి ఇష్టపడటం లేదనీ, బదులుగా రైతులకు కనీస మద్దతు ధరను, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలను నిరాకరించడంతో పేదరికం, శ్రామికవర్గీకరణ క్రూరమైన ప్రక్రియను సులభతరం చేస్తుందని అన్నారు. ఆ విధంగా ప్రధానమంత్రి ప్రకటించుకుంటున్న డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ద్వంద్వ భారతదేశాన్ని సృష్టించిందని ఆరోపించారు.