వారిలో 9 మంది కనబడుట లేదు

9 of them Not visible– బిల్కిస్‌ బానో కేసులో దోషుల మిస్సింగ్‌
అహ్మదాబాద్‌ : బిల్కిస్‌ బానో కేసులో 11 మంది ముద్దాయిలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రెండు వారాలలో లొంగిపోవాలని కూడా ముద్దాయిలను న్యాయస్థానం ఆదేశించింది. అయితే వీరిలో 9 మంది ఆచూకీ తెలియడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక విలేకరి ముద్దాయిలు నివసిస్తున్న గ్రామాలను సందర్శించారు. ముద్దాయిలు ఇచ్చిన చిరునామాలలో సంప్రదించగా తొమ్మిది మంది కనబడడం లేదని ఆయన గుర్తించారు. వీరందరూ ఎక్కడికి వెళ్లారని బంధువులను ప్రశ్నించగా సమాధానం ఇచ్చేందుకు వారు ఇష్టపడలేదు. తన కుమారుడు వారం రోజుల క్రితమే ఇల్లు వదిలి వెళ్లాడని ఓ ముద్దాయి తండ్రి గోవింద్‌ నారు చెప్పారు. సుప్రీంకోర్టు విధించిన శిక్షను కాంగ్రెస్‌ కుట్రగా ఆయన అభివర్ణించారు. పత్రికా విలేకరి వెళ్లినప్పుడు రాధేశ్యామ్‌ షా అనే ముద్దాయి కూడా ఇంటి వద్ద లేడు. అతను పదిహేను నెలల క్రితమే ఇంటి నుండి వెళ్లాడని తండ్రి చెప్పారు. అయితే అతనిని సుప్రీం తీర్పు రాకముందు తాము చూశామని చుట్టుపక్కల వారు, దుకాణాల యజమానులు తెలిపారు. చాలా మంది ముద్దాయిల ఆచూకీ తెలిపేందుకు పొరుగు వారు నిరాకరించారు. ‘మీకు వారు కనిపించరు. వారందరూ ఇళ్లకు తాళం వేసి వెళ్లిపోయారు’ అని ఓ వ్యక్తి చెప్పాడు. తాళం వేసిన ముద్దాయిల ఇళ్ల ముందు కానిస్టేబుల్‌ను నియమించారు. ఈ కేసులో మరో ముద్దాయి ప్రదీప్‌ మోదియా ఆ చిరునామాలోనే లేడు. ఇంకో ముద్దాయి రమేష్‌ చందన ఇచ్చిన చిరునామాలో ఉండడం లేదని, ఇప్పుడు గోద్రాలో ఉంటున్నాడని పొరుగువారు తెలిపారు. రాధేశ్యామ్‌ పొరుగునే ఉండే ముద్దాయిలు శైలేష్‌ భట్‌, మితేష్‌ భట్‌ కూడా కన్పించడం లేదు. వారి గురించి చెప్పేందుకు రాధేశ్యామ్‌ కుటుంబం ఇష్టపడలేదు. ఈ కేసులో ఇతర ముద్దాయిలైన రాజూభారు సోనీ, కేసర్‌భారు ఒహానియా, బాకాబారు ఒహానియా, బిపిన్‌చంద్ర జోషి కూడా ఇచ్చిన చిరునామాలలో లేరు.