‘చేయూత’తో 90.10 లక్షల కుటుంబాలకు లబ్ది

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే రాజీవ్‌ ఆరోగ్య శ్రీ ‘చేయూత’ పథకం క్రింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సాయం అందించడం వల్ల 90.10 లక్షల కుటుంబాలకు లబ్ది చూకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం గుర్తించిన ఆస్పత్రుల్లో లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం శాసన సభ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా 1,672 వైద్యపరమైన విభిన్న ప్యాకేజీలు అందుబాటులోకి రావడంతో పాటు 21 స్పెషాలిటీ సేవలు కూడా అనారోగ్య బాధితులకు సమకూరుతాయని వివరించారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను అందించి, తద్వారా వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా చూడాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.