టెన్త్‌లో 91.31 శాతం ఉత్తీర్ణత

91.31 percent pass in Tenth– గతేడాది కంటే 4.71 శాతం పెరుగుదల
– బాలికలదే పైచేయి  బాలుర కంటే 3.81 శాతం అధికంగా పాస్‌
– 8,883 మందికి పదికి పది సీజీపీఏ
– గతేడాది కంటే 2,720 మంది ఎక్కువ
– 3,927 పాఠశాలల్లో వందశాతం పాస్‌
– గతేడాదికంటే 1,134 స్కూళ్లు అధికం
– ఆరు ప్రయివేటు బడుల్లో సున్నా ఫలితాలు
– అగ్రస్థానంలో నిర్మల్‌, అట్టడుగున వికారాబాద్‌
– జూన్‌ 3 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ : ఫలితాలు విడుదలచేసిన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన హైదరా బాద్‌లోని ఎస్‌సీఈఆర్టీ ప్రాంగణంలో మంగళవారం విడుదల చేశారు. ఈ ఏడాది 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 86.60 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో గతేడాది కంటే ఇప్పుడు 4.71 శాతం ఉత్తీర్ణత పెరగడం గమనార్హం. రెగ్యులర్‌ విద్యార్థులు 4,94,207 మంది పరీక్షలకు హాజరుకాగా, 4,51,272 (91.31 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు 2,48,999 మంది పరీక్షలు రాయగా, 2,22,656 (89.42 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 2,45,208 మంది పరీక్షలకు హాజరైతే 2,28,616 (93.23 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు కంటే బాలికలు 3.81 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 11,606 మంది విద్యార్థులు ప్రయివేటుగా పరీక్షలకు హాజరుకాగా, 5,772 (49.73 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇందులో 7,583 మంది బాలురు హాజరైతే 3,594 (47.40 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 4,023 మంది బాలికలు పరీక్ష రాస్తే, 2,178 (54.14 శాతం) మంది పాసయ్యారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలురు కంటే బాలికలు 6.74 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు, సమగ్ర శిక్ష డైరెక్టర్‌ మల్లయ్య బట్టు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు సిహెచ్‌ రమణకుమార్‌, లింగయ్యతోపాటు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు విజయభారతి, శ్రీనివాసరావు, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గురుకులాల్లో 98.71 శాతం ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్‌ విద్యార్థులకు సంబంధించి 3,927 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఈసారి ఆరు పాఠశాలల్లో ‘సున్నా’ ఫలితాలొచ్చాయి. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.71 శాతంతో అత్యధిక ఉత్తీర్ణతను నమోదు చేశాయి. తెలంగాణ గురుకు లాలు, బీసీ, ఎస్సీ, గిరిజన, మైనార్టీ గురుకులాలతోపాటు మోడల్‌ స్కూళ్లు, ప్రయివేటు పాఠశాలలు, కేజీబీవీలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 91.31 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశాయి. ఆశ్రమ పాఠశాలలు, ఎయిడెడ్‌, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 91.31 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణతను సాధించాయి.
99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ ప్రథమం
పదో తరగతి ఫలితాల్లో 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 8,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8,823 (99.05 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 4,300 మంది బాలురు పరీక్షలు రాస్తే 4,246 (98.74 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 4,608 మంది బాలికలు పరీక్షలకు హాజరైతే 4,577 (99.33 శాతం) మంది పాసయ్యారు. 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 13,976 మంది పరీక్షలు రాయగా, 13,788 (98.65 శాతం) మంది పాసయ్యారు. 98.27 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 6,470 మంది పరీక్షలు రాస్తే, 6,358 (98.27 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 65.10 శాతం ఉత్తీర్ణత నమోదు చేసి వికారాబాద్‌ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 13,357 మంది పరీక్షలు రాయగా, 8,695 (65.10 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ దరఖాస్తు గడువు 15
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల మూడు నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసిన వారు ఆ ఫలితాల కోసం ఎదురుచూడకుండా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలని కోరారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు తుది గడువు ఈనెల 16వ తేదీ వరకు ఉందని చెప్పారు. ఆలస్య రుసుం రూ.50తో ఆ సబ్జెక్టు పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని వివరించారు. ఫలితాలు వెల్లడించిన 15 రోజుల్లోగా అంటే ఈనెల 15 వరకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు కోరారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌ కోసం సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసిన, డీఈవో కార్యాలయానికి సమర్పించిన దరఖాస్తులనే అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులు ఆమోదించబోమని వివరించారు. వివరాల కోసం షషష.bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
పరీక్షలే జీవితం కాదు
ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాక సుమారు పది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. విద్యార్థులకు పరీక్షలే జీవితం కాదని చెప్పారు.