2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి 93 శాతం విరాళాలు

Ahead of the 2019 Lok Sabha elections 93 percent donations to BJP– మొత్తం రూ. 2,902.87 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు
– బీజేపీకే అత్యధికంగా రూ. 2,719.32 కోట్ల బాండ్లు
– కాంగ్రెస్‌కు కేవలం 3.2 శాతమే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2019 ఏప్రిల్‌ 12 నుంచి 2019 మే 10 మధ్య, 13 రాజకీయ పార్టీలు మొత్తం రూ. 2,902.87 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లను స్వీకరించాయి. వీటిలో అత్యధికంగా రూ. 2,719.32 కోట్లు(93 శాతం) బీజేపీ పొందింది. బాండ్లు పొందిన ఇతర పార్టీలలో కాంగ్రెస్‌ కేవలం రూ. 95.29 కోట్లు (3.2 శాతం) పొందింది. టీఎంసీకి రూ.36.2 కోట్లు, బీఆర్‌ఎస్‌కి రూ.13.6 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ.10 కోట్లు, శివసేనకు రూ.8.45 కోట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడీ)కి రూ.6.76 కోట్లు వచ్చాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) రూ. 2 కోట్ల చొప్పున అందుకున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) రూ. 1.5 కోట్లు, జనతాదళ్‌ (యునైటెడ్‌) రూ. 1 కోటి, జమ్మూ కాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు రూ.50 లక్షలు అందాయి.
కలకత్తాకు చెందిన పారిశ్రామికవేత్త మహేంద్ర కుమార్‌ జలాన్‌కి చెందిన సంస్థలు హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలు అందించాయి.
జలాన్‌ సంస్థలు, మేఘా, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌ 2019 ఎన్నికలకు ముందు బీజేపీ డోనర్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ మొత్తం రూ. 2,719.32 కోట్లు అందుకోగా, అగ్రదాతగా మహేంద్ర జలాన్‌ సంస్థలే. జలాన్‌కు చెందిన మదన్‌లాల్‌ లిమిటెడ్‌ రూ. 175.5 కోట్లు, కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ రూ. 144.5 కోట్లు, ఎంకేజే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ. 14.42 కోట్లు ఇచ్చాయి.
బీజేపీకి రెండో అత్యధిక విరాళాలిచ్చిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, పీవీ. కృష్ణారెడ్డి, పీ.పీ. రెడ్డి, 2019 ఏప్రిల్‌-మే మధ్య రూ.125 కోట్లు విరాళంగా ఇచ్చింది. 2019 అక్టోబర్‌లో ఆదాయపు పన్ను శాఖ తన కార్యాలయాల్లో ”తనిఖీ” నిర్వహించింది. తదనంతరం, కంపెనీ రూ. 980 కోట్లను ఎలక్టోరల్‌ బాండ్లను విరాళంగా అందించింది. కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులను కూడా అందుకుంది.
ఈ కాలంలో బీజేపీకి ఇతర అగ్ర దాతలలో వేదాంత లిమిటెడ్‌ రూ. 52.65 కోట్లు, ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ రూ. 50 కోట్లు, బజాజ్‌ గ్రూప్‌, పీహెచ్‌ఎల్‌ ఫిన్‌వెస్ట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఒక్కొక్కటి రూ. 40 కోట్లు విరాళంగా అందించాయి. పారిశ్రామికవేత్త లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ రూ.35 కోట్లు ఇవ్వగా, సన్‌ ఫార్మా లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ రూ.31.5 కోట్లు ఇచ్చింది.
రియల్‌ ఎస్టేట్‌ సమ్మేళనం డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌ (డీఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌ లగ్జరీ హౌమ్స్‌ లిమిటెడ్‌) ఎన్నికలకు ముందు కేవలం బీజేపీకే రూ.25 కోట్లు ఇచ్చింది. 2019 జనవరిలో భూ కేటాయింపు కేసులో అవకతవకలు జరిగాయని ఆరోపించినందుకు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) డీఎల్‌ఎఫ్‌ కార్యాలయాల తనిఖీ నిర్వహించింది. 2019 ఏప్రిల్‌, మే మధ్య రూ. 25 కోట్లు విరాళం ఇచ్చింది.
అదే సమయంలో, రిలయన్స్‌కి చెందిన ముఖేష్‌ అంబానీ అల్లుడు ఆనంద్‌ పిరమల్‌ డైరెక్టర్‌గా ఉన్న పిరమల్‌ గ్రూప్‌, పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ బీజేపీకి రూ.20 కోట్లు ఇచ్చింది.
కాంగ్రెస్‌కు కేవలం 3.2 శాతమే
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మొత్తం బాండ్లలో కాంగ్రెస్‌కు రూ.95.29 కోట్లు (3.2 శాతం) వచ్చాయి. ఇందులో అత్యధికంగా జలాన్‌కు చెందిన కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ నుంచి రూ. 20 కోట్లు, మదన్‌లాల్‌ లిమిటెడ్‌ నుంచి రూ. 10 కోట్లు వచ్చాయి. అదానీకి సంబంధించిన వెల్‌స్పన్‌ కార్ప్‌ లిమిటెడ్‌, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ నుండి రూ. 8 కోట్లు విరాళంగా అందాయి. పిరమల్‌ గ్రూప్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి కాంగ్రెస్‌ రూ.5 కోట్లు అందుకుంది. కాంగ్రెస్‌కు ఇతర అగ్రదాతలలో భారతి ఎయిర్‌టెల్‌ రూ. 8 కోట్లు, ఎంఈఐఎల్‌ రూ. 5 కోట్లు, ముంబయికి చెందిన మోడరన్‌ రోడ్‌ మేకర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 6 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సిమెంట్‌ తయారీ దిగ్గజం స్టార్‌ సిమెంట్‌ మేఘాలయ లిమిటెడ్‌ కూడా కాంగ్రెస్‌కు రూ.4.5 కోట్లు ఇచ్చింది.
టీఎంసీకి కెవెంటర్‌, ఐటీసీ విరాళాలు
టీఎంసీకి అగ్రదాతలలో జలాన్‌కు చెందిన కెవెంటర్‌, ఐటీసీ ఉన్నాయి. టీఎంసీ గత ఐదేండ్లలో రెండో అత్యధిక ఎలక్టోరల్‌ బాండ్లను పొందింది. 2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జలాన్‌ సంస్థల నుండి ఎక్కువ విరాళాలు వచ్చాయి. జలాన్‌కు చెందిన కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీకి అగ్రదాతగా ఉంది. ఈ కాలంలో టీఎంసీ అందుకున్న మొత్తం రూ.36.20 కోట్లలో ఆ సంస్థ రూ.20 కోట్లను ఇచ్చింది. టీఎంసీకి ఇతర అగ్రదాత దేశంలో అతిపెద్ద కార్బన్‌ తయారీదారు ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌. ఆ పార్టీకి రూ.5 కోట్లు ఇచ్చింది. కలకత్తాకు చెందిన ఐటీసీ లిమిటెడ్‌ ఈ కాలంలో పార్టీకి రూ.4.95 కోట్లు ఇచ్చింది.
జలాన్‌ సంస్థలు సమాజ్‌వాదీ పార్టీ, శిరోమణి అకాలీదళ్‌కి కూడా విరాళాలు ఇచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ కేవలం రూ. 10 కోట్ల విలువైన బాండ్లను క్యాష్‌ చేసుకోగా, అవన్నీ జలాన్‌కు చెందిన కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ నుండి వచ్చాయి. మొత్తం రూ.6.76 కోట్లు అందుకున్న శిరోమణి అకాలీదళ్‌, జలాన్‌కు చెందిన కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ నుంచి రూ.50 లక్షలు పొందింది. పార్టీ ఛండీగఢ్‌కు చెందిన ఫాస్ట్‌వే ట్రాన్స్‌మిషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుండి రూ. 5 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లిమిటెడ్‌ నుంచి రూ. 1 కోటి అందుకుంది. ఈ కాలంలో జేడీయూకి కూడా రూ. 1 కోటి ఇచ్చింది. రూ. 8.45 కోట్ల విలువైన బాండ్లను ఎన్‌క్యాష్‌ చేసిన శివసేన, పిరమల్‌ గ్రూప్‌నకు చెందిన పీఆర్‌ఎల్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రూ. 5 కోట్లతో అత్యధికంగా అందుకుంది.
బీఆర్‌ఎస్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌తో సహా హైదరాబాద్‌కు చెందిన సంస్థలు అగ్రదాతలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి 2019 ఎన్నికలకు ముందు రూ. 13.6 కోట్లు అందుకుంది. అందులో రూ. 7 కోట్లు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ నుండి వచ్చాయి. పార్టీకి ఇతర అగ్ర దాతలలో హైదరాబాద్‌కు చెందిన ఎనర్జీ హౌల్డింగ్‌ కంపెనీ మైత్రా ఎనర్జీ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రూ. 5 కోట్లు) ఇచ్చింది. దీనిని జీఎస్‌ డబ్ల్యూ ఎనర్జీ గత సంవత్సరం కొనుగోలు చేసింది. ఐటీసీ లిమిటెడ్‌ నుంచి అదనంగా రూ.1.6 కోట్లు వచ్చాయి.
కలకత్తా, మహారాష్ట్రకు చెందిన సంస్థలు ఆప్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌లకు అగ్ర దాతలుగా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన బీజీ షిర్కే కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ నుండి రూ.1 కోటితో సహా ఈ కాలంలో ఆప్‌ రూ.2 కోట్లు అందుకుంది. ఈ రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం గత ఐదేళ్లలో అన్ని రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు అందజేసిన వారిలో 13వ స్థానంలో ఉంది. ఆప్‌ కూడా టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ నుండి రూ. 1 కోటిని అందుకుంది. ఇది అన్ని రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన పదో స్థానంలో ఉంది. గత ఐదేండ్లలో మొత్తం రూ. 184 కోట్లు విరాళంగా ఇచ్చింది. టోరెంట్‌ గ్రూప్‌ చైర్మెన్‌ ఎమెరిటస్‌ సుధీర్‌ మెహతా ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు.
కలకత్తాకు చెందిన అంబుజా హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ నుండి 2019 ఎన్నికలకు ముందు ఎన్సీపీ మొత్తం రూ.2 కోట్లు అందుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రూ.50 లక్షలు అందుకుంది. ఈ సమయంలో డీఎంకే ముంబయికి చెందిన మోడరన్‌ రోడ్‌ మేకర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుండి రూ.2 కోట్లు అందుకుంది. ఆర్జెడీ మొత్తం 1.5 కోట్లు అందుకుంది. అందులో కలకత్తాకు చెందిన క్వాలిటీ మెయింటెనెన్స్‌ వెంచర్‌ లిమిటెడ్‌ (రూ. 50 లక్షలు), ఎన్‌సీఆర్‌కు చెందిన రిచా అండ్‌ కో (రూ. 50 లక్షలు), సరితా హండా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రూ. 30 లక్షలు) నుంది విరాళాలు అందుకుంది.