డీఎస్సీకి రెండోరోజు 94.69 శాతం హాజరు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) రాతపరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం రెండోరోజు 27,061 మంది దరఖాస్తు చేయగా, వారిలో 25,625 (94.69 శాతం) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. 1,436 (5.31 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. శుక్రవారం సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) తెలుగు మాధ్యమం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించామని తెలిపారు. డీఎస్సీకి 2,79,957 దరఖాస్తులొచ్చిన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.