941 మొబైల్స్‌ రికవరీ, బాధితులకు అందజేత

Telangana– వారం రోజుల వ్యవధిలోనే 135 ఫోన్ల రికవరీ
– జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌
నవతెలంగాణ-సంగారెడ్డి
జనవరి-2024 నుంచి సీఈఐఆర్‌ పోర్టల్‌ నమోదు చేయబడిన 941 మొబైల్స్‌ రికవరీ చేసి బాధితులకు అందజేశామని జిల్లా ఎస్పీ రూపేష్‌ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ”మొబైల్‌ రికవరీ మేళ” నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ మాట్లాడుతూ దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ ఫోన్ల రికవరీ కోసం గత వారం రోజుల క్రితం జిల్లాలో స్పెషల్‌ టీంను ఏర్పాటు చేసి, ప్రత్యేక దష్టి సారించామని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు సీఈఐఆర్‌ పోర్టల్‌ నందు నమోదు చేయబడిన 3501 దరఖాస్తులలో 1604 ఫోన్లను గుర్తించి, 941 సెల్‌ ఫోన్‌లను బాధితులకు అందించామని తెలిపారు. ఇందులో గత వారం రోజుల క్రితం ఏర్పాటు చేయనడిన స్పెషల్‌ టీమ్‌-135 సెల్‌ ఫోన్‌లను మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేయడం జరిగిందన్నారు. సెల్‌ ఫోన్‌ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికై డిఓటి(డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ టెలీ-కమ్యూనికేషన్‌) సిఈఐఆర్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఎవరైన మొబైల్‌ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సిఈఐఆర్‌ పోర్టల్‌ నందు బ్లాక్‌ చేసి, సంభందిత పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్‌ నేరాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి అనవసర లింకులను ఓపెన్‌ చేయకూడదని, ఆన్లైన్‌లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరాలకు గురైనట్లైతే వెంటనే 1930కు కాల్‌ చేసి గాని, సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అడిషనల్‌ ఎస్పీ సంజీవరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.