– ఆ సంస్థ విలువ రూ.8200 కోట్లే
– అమెరికన్ సంస్థ బ్లాక్‌రాక్ అంచనా
– ఎడ్‌టెక్ సంస్థకు మరింత గడ్డుకాలం..!
న్యూఢిల్లీ : కరోనా కాలంలో ఒక వెలుగు వెలిగిన ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ విలువ ఇప్పుడు అమాంతం పడిపోయింది. ఆర్థిక సంక్షోభం వైపు అడుగులేస్తున్న బైజూస్ ప్రస్తుత విలువ ఒక్క బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,200 కోట్లు)కు పడిపోయిందని అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, అసెట్ మేనేజర్ బ్లాక్‌రాక్ అంచనా వేసింది. 2022లో నిధులు సమీకరించిన సమయంలో బైజూస్ విలువ ఏకంగా 22 బిలియన్ డాలర్లు (దాదాపు 1.82 లక్షల కోట్లు)గా ఉంది. ఈ అంచనాతో పోలిస్తే 95 శాతం విలువ తగ్గిపోయింది. బైజూస్ ఒక్కో షేరు విలువను బ్లాక్‌రాక్ 2022 ఏప్రిల్‌లో 4,660 డాలర్లుగా అంచనా వేసింది. డిసెంబర్ నాటికి దాన్ని 2,400 డాలర్లకు.. తాజాగా 210 డాలర్లకు కుదించింది. బైజూస్‌లో తమ వాటాల ఆధారంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసినట్టు బ్లాక్‌రాక్ వెల్లడించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింపుపై బైజూస్ స్పందించలేదు.
కొత్తగా పెట్టుబడులు సమీకరించడంతో పాటు ఆర్థిక ఫలితాల వెల్లడిలో జాప్యం, రుణ దాతలతో న్యాయ పరమైన వివాదాలు తదితర అంశాలపై బైజూస్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుంది. క్లిష్ట సమయంలో బ్లాక్ రాక్ విలువ తగ్గించడంతో బైజూస్ పరిస్థితి మరింత గందరగోళంగా మారనుంది. మరింత గడ్డు పరిస్థితుల్లోకి నెట్టబడనుంది. 2021లో బిలియన్ డాలర్ల పెట్టుబడులతో 1 శాతం వాటాను బ్లాక్‌రాక్ కొనుగోలు చేసింది. బైజూస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గించడం బ్లాక్‌రాక్ సంస్థకు ఇది తొలిసారి కాదు. 2022 డిసెంబర్‌లో 11.5 బిలియన్ డాలర్లకు తగ్గించింది. బైజూస్ అంచనా విలువను బ్లాక్‌రాక్‌తో పాటు ఇతర ప్రముఖ సంస్థలు సైతం తగ్గిస్తూ వస్తున్నాయి. 2023 నవంబర్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన ప్రోసస్ ఎన్‌వి సంస్థ విలువను మూడు బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. బైజూస్‌లో ఈ కంపెనీకి 9.7 శాతం వాటాలున్నాయి. అంతకుముందు అమెరికాకు చెందిన బారన్ క్యాపిటల్ సైతం కంపెనీ విలువను 2023 జూన్ నాటికి 11.7 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. కరోనా తర్వాత ఆన్‌లైన్ విద్యకు ఆదరణ తగ్గడంతో పాటు బైజూస్ విలువ పడిపోతోంది. బైజూస్ ఆర్థిక ఫలితాల వెల్లడిలోనూ తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో ఇన్వెస్టర్లకు ఆ సంస్థపై విశ్వాసం తగ్గడంతో కొత్త నిధులు పుట్టడం లేదు. తాజాగా విలువ తగ్గింపు ఆ సంస్థకు మరిన్ని ఆర్థిక కష్టాలను తెచ్చి పెట్టనున్నాయి.