సింగరేణి ఎన్నికలలో 95% పోలింగ్..

– ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

– గనులపై కార్మిక సంఘాల హడావిడి
నవతెలంగాణ – సింగరేణి ప్రతినిధి

సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రక్రియ అనేక ఒడిదుడుకులు ఉత్కంఠత, కోర్టు వాయిదాలు మొట్టికాయల మధ్య ఎట్టకేలకు బుధవారం ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ లోని 11 డివిజన్ల కార్మికులు ఎన్నికలలో  95 శాతం కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రామగుండం డివిజన్ వన్ పరిధిలో 5384 ఓట్లకు గాను 5044(93.7౦శాతం)  అర్జీ టు లో 3556 ఓట్లలో 3369 (94.74శాతం)   ఆర్జీ-3లో 3884 ఓట్లలో 3612 (93.00శాతం)  కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  భూపాల్ పల్లి డివిజన్ లో 5442 ఓట్లలో 5123 (94.13శాతం)  బెల్లంపల్లి డివిజన్ లో 996 ఓట్లలో 959 (96.30 శాతం)  మందమర్రి డివిజన్లో 4835 ఓట్లలో 4515 (93.40 శాతం)  శ్రీరాంపురంలో 9127 ఓట్లలో 8491 (93.00శాతం)  కార్మికులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇల్లందు డివిజన్ లో 614 మందికి గాను 604 ఓట్లు (98.37శాతం), మణుగూరులో 2450  ఓట్లలో 2378 (97.06శాతం)  కార్పొరేట్ డివిజన్లో 1191 ఓట్లలో 1149  (96.47శాతం) కొత్తగూడెం డివిజన్లో 2326 ఓట్లలో 2207 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సింగరేణి వ్యాప్తంగా 39805 ఓట్లలో 37,451  (95%) కార్మికులు తమ ఓటు వేశారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు, సింగరేణి ఉద్యోగులు పనిచేసే ఆయా గనులు, డిపార్ట్ మెంట్ లలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సింగరేణి అధికారులు, పోలీస్ యంత్రాంగం, సింగరేణి రక్షణ విభాగం సమన్వయంతో పని చేశాయి. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు పోలింగ్ బూతులకు 200 మీటర్ల పరిధి దాటిన తర్వాతనే కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేసుకోవడానికి వీలుగా మార్కింగ్ ఇచ్చారు. ప్రధానంగా ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి, సిఐటియు, హెచ్ ఎం ఎస్, బిఎంఎస్ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో గనులపై తమ కార్యకర్తలను మొహరించి ప్రచారం చేశారు. ప్రధాన పోటీ ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి, సిఐటియుల మధ్యనే కొనసాగుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. రెండేళ్ల కాలపరిమితి కోసం జరుగుతున్న ఎన్నికలు ఎట్టకేలకు ప్రశాంతంగా ముగియటం అన్ని వర్గాల్లో సంతోషo వెల్లివిరిసింది. పోలింగ్ సమయం ముగిసే వరకు పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్ లో నిలబడిన కార్మికులందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. పోలింగ్ బాక్సులను, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసిన అనంతరం పోలింగ్ అధికారులు పటిష్టమైన బందోబస్తు మధ్య కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు.