– గెలవాలనుకుంటున్న బీజేపీ
– తెలంగాణలో కాషాయపార్టీకి ఓటమి భయం : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
తెలంగాణలో ప్రజలను నమ్ముకున్న నాయకుడే ఎన్నికల్లో నిలబడతాడని, జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదని, నల్లాలు ఇచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలా? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా? అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే హిందూ ముస్లింల మధ్య కొట్లాట పెట్టి బీజేపీ గెలవాలనుకుంటోందని తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కిషన్‌నగర్‌లో బీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లో గత పాలకులు కడుపులు నింపుకునే పనిలో ఉన్నందున అభివృద్ధి జరగలేదన్నారు. పేదల కడుపు నింపే నాయకుడు సతీష్ అని, అందుకే అభివృద్ధి జరిగిందన్నారు. ఎమ్మెల్యే అంటే సతీష్‌కుమార్ లాగా ఉండాలని, నిజాయితీగల శాసనసభ్యుడని కొనియాడారు. రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి ఎవరని ఎవరి నడిగినా కేసీఆర్ అనే సమాధానం వస్తుంద న్నారు. హుస్నాబాద్‌లో కూడా మూడోసారి సతీష్‌కుమార్‌ను గెలిపించుకుందామని కార్య కర్తలకు పిలుపునిచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ఈ నెల 16న ప్రారంభం చేయనున్నారని, దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.