సోనియా సభకు అడ్డంకులు

Obstacles to Sonia Sabha– ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ ధ్వజం
– కేయూలో విద్యార్ధుల దీక్షకు సంఘీభావం
నవ తెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
సోనియా సభకు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. తొలుత కాకతీయ విశ్వవిద్యాలయం క్రాస్‌రోడ్డులో దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించి వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఎచ్‌డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవలను ప్రశ్నించిన విద్యార్ధులకు వైస్‌ చాన్స్‌లర్‌ సమగ్రంగా స్పందించి ఉంటే ఈ రోజు ఈ నిరసన ఉండేది కదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్ధుల పోరాటాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. యూనివర్సిటీ విద్యార్ధుల తెలంగాణ ఉద్యమంలో చేసిన త్యాగాల ఫలితంగానే ఈ రోజు మీకు పదవులు వచ్చిన సంగతి గుర్తించాలని హెచ్చరించారు. విద్యార్ధులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం హన్మకొండ విష్ణుప్రియ గార్డెన్‌లో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌ తుక్కుగూడలో నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగసభకు లక్షలాది మంది కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, ఈనెల 17న వరంగల్‌లో బీజేపీ సభ నిర్వహిస్తామని, ఇందులో హౌంమంత్రి అమిత్‌షా పాల్గొంటారని ప్రకటించిన మంత్రి కిషన్‌రెడ్డి.. అదేరోజు సోనియాగాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిసి సభను వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు మార్చుకున్నారని ఆరోపించారు. సోనియా సభకు పరేడ్‌ గ్రౌండ్‌తోపాటు ఏ మైదానం దొరకకుండా చేశారన్నారు. చివరకు తుక్కుగూడలోని రైతులే స్వచ్ఛందంగా బహిరంగసభ నిర్వహించడానికి భూములను ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కేంద్రంలో బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి.. తీవ్రస్థాయిలో నిరుద్యోగం పెంచిందని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి అంతా కేసీఆర్‌ కుటుంబానికే పరిమితమైందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేద ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఆంధ్రా చిన్నజీయర్‌ స్వామి కాళ్ల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్‌ తాకట్టుపెట్టారన్నారు. త్వరలోనే కేవీపీ, కేసీఆర్‌ కలిసి చర్చలు జరిపిన ఫోటోలను బహిర్గతం చేస్తానని తెలిపారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమా అని సీఎంకు రేవంత్‌ సవాల్‌ విసిరారు.
మోదీతో అంటకాగుతున్న కేసీఆర్‌
తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకోవడాన్ని గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే, ఆమెను సాదరంగా ఆహ్వానించాల్సిన సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీతో అంటకాగుతున్నారని ఆరోపించారు. సోనియా సభకు కుట్రతో, కుతంత్రాలతో అడ్డంకులు కల్పిస్తున్నారన్నారు. వీరి కుట్రలను భగం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఘనవిజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో ఏఐసీసీ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రదీప్‌ ఉత్తమ్‌ రావు దాళ్వి, టీపీసీసీ పరిశీలకులు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, శోభ, మాజీ మంత్రులు పోరిక బలరాంనాయక్‌, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, గండ్ర సత్యనారాయణరావు, దొమ్మటి సాంబయ్య, డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.