– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు
– సీడీపీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన అంగన్‌వాడీలు
నవతెలంగాణ-షాద్‌నగర్
అంగన్‌వాడీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అంగన్‌వాడీ సమస్యలపై ఇన్ని రోజులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్.రాజు అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్స్ ,హెల్పర్స్ ,మినీ టీచర్స్, సమ్మె గురువారంతో నాల్గొవరోజుకు చేరింది. సీడీపీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్‌వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని తెలిపారు. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని, రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు నిర్ణయించాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత నిబంధనల ప్రకారం పడవ తరగతి అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, సీనియార్టీని బట్టి వేతనంలో వ్యత్యాసం ఉండాలని వివరించారు. ఇంక్రిమెంట్ సౌకర్యం కల్పించాలని, బిఎల్‌ఓ డ్యూటీలు రద్దు చేయాలని కోరారు. పక్కా భవనాలు, మౌలిక వసతులు కల్పించాలని, 2018 అక్టోబర్‌లో కేంద్రం పెంచిన వేతనం అంగన్‌వాడీ టీచర్లకు రూ. 1,500లు, హెల్వర్లకు రూ.750లు, మినీ వర్కర్లకు రూ.1,250లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017 నుంచి టీఏ, డీఏ ఇంక్రిమెంట్, ఇన్‌చార్జి అలవెన్స్ బకాయిలు మొత్తం చెల్లించాలని అన్నారు. దీనికి సరిపడా బడ్జెట్‌ను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు ఆసరా, కల్యాణలక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాలని అన్నారు. పిఆర్సి ఎరియర్స్ 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలలవి వెంటనే చెల్లించాలని అన్నారు.అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి సాయిబాబు, బి కేఎంయు జిల్లా కార్యదర్శి బుద్ధుల జంగయ్య, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ నాయక్, అంగన్‌వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు జయమ్మ, ఊర్మిళ ,జయ గౌడ్ ,నాగజ్యోతి, పద్మ, పుష్ప, రత్నమ్మ, ఇందిరా, తులసి, నిర్మల, మమత, భారతమ్మ చంద్రకళ, మల్లేశ్వరి, సంగీత, శారద, వీణ, మంజుల, గిరిజ తదితరులు పాల్గొన్నారు.