కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

– ప్రశ్నించే ముందు ఆలోచించుకోవాలి
– ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి
నవతెలంగాణ-జగిత్యాల
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాస్తవాలు తెలుసుకుని, ప్రశ్నించే మందు ఆలోచించాలని కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. బుధవారం జరిగిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను జీవన్‌రెడ్డి ఖండించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేశామని, తాగునీరు, విద్యుత్‌ సరఫరా సౌకర్యం కల్పించి, మౌలిక వసతులకు పెద్దపీట జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్న మామిడి మార్కెట్‌ను రైతుల కోసం 25 ఎకరాల్లో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే యావర్‌ రోడ్డు అంశం తెరపైకి తీసుకువస్తున్నారని, కాంగ్రెస్‌ పాలనలో యావర్‌ రోడ్డును 40ఫీట్ల నుంచి 60 ఫీట్లకు పెంచామని తెలిపారు. 2017లో అప్పటి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటిపర్తి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌కు యావర్‌ రోడ్డును 100ఫీట్లకు పెంచాలని ప్రతిపాదన చేశామని, యావర్‌ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి పేరు వస్తుందనే అక్కసుతో అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికల్లో యావర్‌ రోడ్డు అంశాన్ని ఉపయోగించుకున్నారని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట మాత్రమే రోడ్డు యావర్‌ రోడ్డు వెడల్పు చేశారని, ప్రయివేట్‌ ఆస్తులు ఉన్న చోట వెడల్బు చేయలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్థలం సేకరించి, నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపడితే వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి పేరు వస్తుందని, పూర్తి చేయకుండానే అదే స్థలంలో డబల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణం తెరపైకి తీసుకొచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదని విమర్శించారు. మున్సిపల్‌ బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న నాయకులు యావర్‌ రోడ్డు వెడల్పులో స్థలం కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేయకుండా, టీడీఆర్‌ తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. బోర్నపల్లి వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని 2014లో సీఎం కేసీఆర్‌కు విన్నవించుకోగా, వంతెన మంజూరు చేశారని, సీఎం కేసీఆర్‌ సైతం పలు సందర్భాల్లో బోర్నపల్లి వంతెన అంశాన్ని ప్రస్తావించారు గుర్తు చేశారు. జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు అప్పగించామని ఎమ్మెల్సీ కవిత గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ మహిళకు కేటాయించిన స్థానంలో బీసీలను కాకపోతే వేరే వారికి ఇస్తారా అని ప్రశ్నించారు. కుటుంబ పాలన గురించి కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎవరిదీ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలకు తెలుసాని పేర్కొన్నారు. పోడు భూముల పట్టాల పంపిణీపై రాహుల్‌గాంధీ అప్డేట్‌ కావాలనే వ్యాఖ్యను ఖండిస్తూ.. మీ లాగా స్కాంల్లో అప్డేట్‌ కావడం మాకు సాధ్యం కాని పని అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత జగిత్యాలలోని అత్మీయ సమ్మేళనంలో బీజేపీ నాయకత్వంపై ఒక్క విమర్శ చేయలేదని, కవిత మద్యం కేసులో పీకల్లోతు కూరుకుపోయి ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని, మాట్లాడాలని, అవాకులు.. చెవాకులు పేలడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హితవు పలికారు. కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు బండశంకర్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మీ దేవేం దర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కాంగ్రెస్‌ జగిత్యాల రూరల్‌ మండలా ధ్యక్షుడు జున్ను రాజేందర్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొత్త మోహన్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గుండా మధు తదితరులు పాల్గొన్నారు.