చరిత్రను వక్రీకరిస్తే కాలగర్భంలో కలుస్తారు

If you distort history, you will meet in the womb of time– ఇచ్చిన హామీలు అమలు చేయని పాలక పార్టీలను నిలదీయండి : జూలకంటి పిలుపు
–  సీపీఐ(ఎం)లో పెద్దఎత్తున చేరిన యువకులు, మహిళలు
నవతెలంగాణ- అడవిదేవులపల్లి
చరిత్రను వక్రీకరిస్తే కాలగర్భంలో కలిసిపోతారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో ప్రజా సమస్యల అధ్యయనం కోసం ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి నాయకత్వంలో మహిళలు, యువకులు పెద్దఎత్తున సీపీఐ(ఎం)లో చేరారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. పాలక పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీల నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు పూర్తయినా ఇప్పటికీ అందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇండ్ల స్థలాలు, ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అణగదొక్కపడుతున్న వారి గొంతుక అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, దున్నేవాడికే భూమి కావాలని నిజాంకు, దొరలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహత్తర పోరాటాన్ని హిందూ ముస్లిం గొడవలుగా చూపెట్టాలని కుట్ర పన్నుతున్నదన్నారు. ఆ కుట్రను ప్రజానీకం మొత్తం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఏనాటికైనా సమ సమాజ స్థాపన ఎర్రజెండా నాయకత్వంలో జరుగుతుందని, అందరికీ అన్ని రకాల హక్కులు సిద్ధిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవి నాయక్‌, రాగిరెడ్డి మంగారెడ్డి, సీతారాములు, రెమడాల పరశురాములు, వినోద్‌నాయక్‌, జిట్టంగి సైదులు, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్‌ నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు నరేష్‌, ఖమ్మంపాటి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.